సీఎంఆర్ ఎగవేత కేసులో యాక్షన్ స్టార్ట్

కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో 2021 నుంచి 2023 వరకు పేరుకుపోయిన సీఎంఆర్ బకాయిల (CMR Dues) జమకు విధించిన ఫిబ్రవరి 28తో ముగియడంతో సర్కార్ యాక్షన్ షురూ చేసింది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సుమారు రూ.400 కోట్ల సీఎంఆర్ బకాయిలు ఉండగా మొండి బకాయిదారులపై ఆర్ఆర్ యాక్ట్ ప్రయోగిస్తోంది. ఈ క్రమంలోనే పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కాట్నపల్లి శివారులోని సాయి మహాలక్ష్మి ఇండస్ట్రీస్‌లో రూ.19.89 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి పట్టించిన కేసులో మిల్లు ఎండీ బండారి మారుతి (Bandari Maruthi), ఆయన భార్య శారద (మిల్లులో మేనేజింగ్ పార్ట్‌నర్)ను సుల్తానాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి ఆదివారం జైలుకు పంపారు.

డిఫాల్టర్లపై ఫోకస్

ఈ కేసుకు సంబంధించి అధికారులు మిగతా డీఫాల్టర్లపైనా దృష్టి సారించారు. అయితే రూ.19.89 కోట్ల బకాయిల రికవరీ కోసం పోలీసులకు ఫిర్యాదుచేసి బండారి దంపతులను అరెస్టు చేయించడంలో పెద్దపల్లి సివిల్ సప్లై ఆఫీసర్లు ముందుంటే.. కరీంనగర్ జిల్లా ఈ దంపతులే రూ.110 కోట్ల మేర బకాయి ఉన్నప్పటికీ.. కరీంనగర్ జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లు చూసీచూడనట్లు వ్యవహరించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

48 మిల్లులు.. 350 కోట్ల బకాయిలు

పెద్దపల్లి జిల్లాలో 2021 – 22, 2022 – 23, 2023 – 24లో రబీ, ఖరీఫ్ సీజన్లకు సంబంధించి 143 మిల్లుల నుంచి రూ.495 కోట్ల విలువైన సీఎంఆర్ రావాల్సి ఉండగా.. అనేకసార్లు నోటీసులు ఇచ్చి, గడువు పెంచుతూ పోవడంతో ఎట్టకేలకు 95 మిల్లుల నుంచి 277 కోట్ల సీఎంఆర్ నగదు, బియ్యం రూపంలో రికవరీ అయింది. ఇంకా 48 మిల్లుల నుంచి రూ.218 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యేకు చెందిన మిల్లులు కూడా ఉన్నట్లు తెలిసింది. పెద్దపల్లి జిల్లా తర్వాత అత్యధికంగా సీఎంఆర్ పెండింగ్ కరీంనగర్ జిల్లాలో ఉంది.

పెండింగ్‌లో 88 వేల మెట్రిక్ టన్నులు

2022 – 23 ఖరీఫ్ సీజన్ లో సీఎంఆర్ 88 వేల మెట్రిక్ టన్నులు పెండింగ్ లో ఉండగా.. 2023 –24లో 20 మిల్లుల నుంచి 22,996 మెట్రిక్ టన్నులు బకాయి (CMR Dues) ఉంది. ఇందులో కేవలం 11 రైస్ మిల్లుల నుంచి రూ.121 కోట్ల మేర సీఎంఆర్ రికవరీ కావాల్సి ఉంది. ఆ మిల్లులపై ఆర్ఆర్ యాక్ట్ ఇంపోజ్ చేశామని, తహసీల్దార్ల వద్ద ఆక్షన్ పెండింగ్ లో ఉందని జిల్లా సివిల్‌సప్లైశాఖ డీఎం రజనీకాంత్ చెప్తుండగా.. ఇదే విషయమై శంకరపట్నం, మానకొండూరు తహసీల్దార్లను సీపీఐ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ ఆర్టీఐ కింద సమాచారం అడిగితే.. ఆర్‌ఆర్ యాక్ట్‌కు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని సమాచారం ఇవ్వడం గమనార్హం. ఇల్లంతకుంట తహసీల్దార్ 2024 డిసెంబర్ లో రూ.68 కోట్ల రివకరీ కోసం శ్రీసీతారామ అగ్రో ఇండస్ట్రీస్ యజమానులు బండారి మారుతి, శారద దంపతులకు నోటీసు ఇచ్చి వదిలేశారు.

ఆఫీసర్ల సాయంతోనే తప్పించుకుంటున్నారా?

ప్రభుత్వం ధాన్యం అప్పగించాక మూడు నెలల్లోపు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆఫీసర్ల అలసత్వం వల్ల గడువులోగా చాలా మంది మిల్లర్లు బియ్యం అప్పగించడం లేదు. మళ్లీ ఆఫీసర్లే వారికి అనేక అవకాశాలు ఇస్తూ పోతున్నారు. పైసా పెట్టుబడి లేకుండా కోట్ల రూపాయల బియ్యాన్ని బయట మార్కెట్‌లో అమ్ముకోవడం, వచ్చిన డబ్బులను ఇతర వ్యాపారాల్లో పెట్టుబడిగా పెట్టడం కొందరు మిల్లర్లకు అలవాటుగా మారింది. ఈ దందాలో జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ నాయకులు కూడా భాగస్వాములుగా ఉన్నారనే ఆరోపణలు ఉన్నాయి.

అధికారులకు లంచాలు

ఏడాదిన్నర క్రితం జిల్లా సివిల్ సప్లై ఆఫీసర్లకు లక్షల్లో లంచాలు ముట్టజెప్పినట్లు అసోసియేషన్ నాయకులు తమ లెక్కల్లో రాసుకోవడం అప్పట్లో వివాదానికి దారితీసింది. ఈ విషయంలో ఆఫీసర్లు మౌనంగా ఉన్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని ఎస్వీ ఇండస్ట్రీస్ యజమాని సంకీస నాగరాజు 2014-15 ఖరీఫ్ లో 3317.42 క్వింటాళ్ల ధాన్యం దారి మళ్లించగా.. ఆయన రూ.61.59 లక్షలు చెల్లించాల్సి ఉంది. పదేళ్లు కావడంతో వడ్డీ, జరిమానాతో కలిపితే కోటిన్నర దాటే అవకాశముంది. ఇప్పటికే నాగరాజు మృతిచెందగా ఆ మిల్లును కూడా లోన్ బకాయి కింద బ్యాంకువాళ్లు వేలం వేశారు. ఆయనకు సంబంధించి ఆస్తులేవి లేవు. ఇలా బ్యాంకు లోన్ తీసుకుని ప్రారంభించిన మిల్లులతోనే చాలా మంది మిల్లర్లు వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో లోన్ చెల్లించలేదని కొన్ని మిల్లులను బ్యాంకులు జప్తు చేస్తుండడంతో.. అలాంటి మిల్లు ఓనర్ల నుంచి కోట్లాది రూపాయల సీఎంఆర్ రికవరీ ఆఫీసర్లకు పెద్ద సవాల్ గా మారింది. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో కొందరైతే తమవి కాని మిల్లులను లీజ్ కు తీసుకుని.. ప్రభుత్వం అప్పగించిన ధాన్యాన్ని మొత్తంగా రాష్ట్రం దాటించేశారు. మిల్లు వారిది కాదు.. ధాన్యం వారిది కాదు. పైసా పెట్టుబడి లేకుండా ఇలా రూ.కోట్లు కొల్లగొట్టారు. వాళ్ల పేర్ల మీద పెద్దగా ఆస్తులు లేకపోవడంతో ఆ డబ్బులు ఎలా రికవరీ చేస్తారనే ప్రశ్నార్థకంగా మారింది.

Read Also: వెలుగుమట్ల బాధితులకు కవిత భరోసా

Follow Us On : WhatsApp

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>