సీఎస్‌కు మరో ఎక్స్ టెన్షన్.. ప్రధానికి సీఎం రేవంత్ కీలక లేఖ

కలం, తెలంగాణ బ్యూరో : ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Telangana CS) రామకృష్ణారావుకు మరోసారి ఎక్స్ టెన్షన్ ఇవ్వాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లేఖ రాశారు. రెండు రోజుల క్రితమే సీఎంఓ నుంచి ప్రధాని కార్యాలయానికి ఈ లేఖ వెళ్ళింది. దీనిపై రిప్లై రావడానికి 15 రోజుల సమయం పట్టే అవకాశమున్నది. ప్రస్తుతం ఫస్ట్ ఎక్స్ టెన్షన్ మీద సీఎస్‌గా కొనసాగుతున్న రామకృష్ణారావు మార్చి 31న బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి ఉన్నది. కానీ ప్రభుత్వానికి ఉన్న కొన్ని ముఖ్యమైన పనుల కారణంగా మరోసారి గడువును పొడిగించాలని రాష్ట్రం కోరుతున్నది. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని కొన్ని ప్రత్యేక క్లాజులను పరిగణనలోకి తీసుకుని రెండోసారి ఎక్స్ టెన్షన్ వచ్చే అవకాశమున్నదని సీఎంఓ వర్గాల సమాచారం. ఈ నెల 6న లేఖ రాసినందున 20వ తేదీకల్లా ప్రధాని కార్యాలయం నుంచి సానుకూల స్పందన వచ్చే అవకాశమున్నదనే అభిప్రాయం సీఎంఓ వర్గాల్లో వ్యక్తమవుతున్నది.

మరో ఎక్స్ టెన్షన్ ఎందుకోసం? :

కేంద్ర ప్రభుత్వం సెన్సస్ (Census) ప్రక్రియను మొదలుపెట్టనున్నందున ప్రస్తుత పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీని (Telangana CS) మారిస్తే కింది స్థాయి ఐఏఎస్ అధికారుల మధ్య సమన్వయంలో ఇబ్బందులు ఎదురవుతాయన్నది రాష్ట్ర ప్రభుత్వ భావన. సెన్సస్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు మే 11 నుంచి జూన్ 9 వరకు రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూలు ఖరారు చేసింది. వివిధ శాఖల అధికారులతో సీఎస్ రివ్యూ కూడా చేశారు. ఏయే శాఖ నుంచి ఎంత మంది సిబ్బందిని సమకూర్చాలనే కార్యాచరణ కూడా మొదలైంది. దీనికి తోడు ఈ నెల 16 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నందున ఇబ్బందులు లేకుండా ఎక్స్ టెన్షన్ కోరుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం మొదలుపెట్టిన ‘99 రోజుల ప్రగతి ప్రణాళిక’ కూడా జూన్ వరకు కొనసాగనున్నది. ఈ కారణాల రీత్యా జూన్ వరకు సీఎస్ బాధ్యతల్లో ఆయన కొనసాగడం అవసరమని రాష్ట్రం భావిస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో చీఫ్ సెక్రటరీని మారిస్తే ఇబ్బందులు వస్తాయన్న కారణంగా ఎక్స్ టెన్షన్ కోసం రాష్ట్రం ప్రయత్నిస్తున్నది.

సెకండ్ టైమ్ ఎక్స్ టెన్షన్ :

రామకృష్ణారావు (Ramakrishna Rao) గతేడాది ఆగస్టులో ఆయన రిటైర్ అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఒకేసారి ఏడు నెలల పాటు ఎక్స్ టెన్షన్ వచ్చింది. ముఖ్యమంత్రి రిక్వెస్టుకు కేంద్రం అప్పట్లో సానుకూలంగా స్పందించింది. ఆ ప్రకారం గడువు ఈ నెల 31తో ముగియనున్నది. దీంతో రెండోసారి ఎక్స్ టెన్షన్ కనీసంగా మూడు నెలల పాటు ఇవ్వాలని ఆ లేఖలో ప్రధానికి సీఎం రిక్వెస్టు చేసినట్లు తెలిసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్లోని ‘రెసిడ్యుయరీ రూల్స్’ లోని 3 ప్రకారం ఈ ఎక్స్ టెన్షన్ ఇవ్వాలని కోరినట్లు తెలిసింది. సాధారణ నిబంధనల్లో ఎలాంటి ప్రతికూల పరిస్థితులు ఉన్నా రెసిడ్యుయరీ రూల్స్ లోని నిబంధన ప్రకారం వాటన్నింటినీ అధిగమించే అవకాశం ఉన్నందున దీన్ని ప్రస్తావించినట్లు సమాచారం. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్నందున కీలకమైన బడ్జెట్ ప్రక్రియకు ఇబ్బందులు లేకుండా ఉండేలా ఈ క్లాజ్‌ను పేర్కొన్నట్లు తెలిసింది.

Read Also: విమెన్స్ డే స్పెషల్ : బ్రిలియంట్ ఆఫీసర్.. సైలెంట్ ఆపరేషన్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>