కలం, వెబ్ డెస్క్: కేంద్రం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR)పై అందరూ అవగహన పెంచుకోవడం సంతోషకరమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్ఐఆర్ వల్ల సామాన్యులు, పేదలకు, కాంగ్రెస్ కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు రాబోతున్నాయో నాయకులు గుర్తించడం మంచి పరిణామమని చెప్పారు. గాంధీ భవన్‌లో శుక్రవారం సాయంత్రం పీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, పీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం నిర్వహించారు. ఈ మీటింగ్ లో సంఘటన్ సృజన్ అభియాన్‌లో భాగంగా నూతన డీసీసీ అధ్యక్షుల ఎంపికకు సంబంధించి చర్చించారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, బలోపేతానికి సంబంధించిన అంశాలపై చర్చించారు. ఎస్ఐఆర్ ప్రక్రియ (SIR Voter List Revision), బూత్ స్థాయి సంస్థాగత బలోపేతంపై విస్తృతంగా సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు చేశారు.
మహిళలకూ సమస్యలు ఎదురుకావొచ్చు..
ఎస్ఐఆర్ ప్రక్రియతో లంబాడీలు, ఆదివాసీలు, వలస కార్మికులకు పెద్ద సమస్య కావొచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. కొన్ని నియోజకవర్గాల్లో చాలా మంది వలస పోయారని చెప్పారు. మహిళలకు కూడా ఎస్ఐఆర్ వల్ల సమస్యలు ఎదురుకావొచ్చని అన్నారు. ఎస్ఐఆర్ వల్ల దళితులు, మైనార్టీలు, మహిళల ఓట్లు పోయే అవకాశం ఉందని.. దీనివల్ల తలెత్తే సమస్యలకు పరిష్కారంపైన సంపూర్ణ అవగాహన పెంచుకోవాలని సూచించారు. బూత్ ఎన్ రోలర్ సాయంతో గతంలో 90 రోజుల్లో 45 లక్షల డిజిటల్ మెంబర్ షిప్ చేయించామని గుర్తు చేశారు. ఎక్కువ సభ్యత్వం నమోదు చేయించిన వారికి రాహుల్ గాంధీతో సన్మానం చేయించామన్నారు. గతంలో కాంగ్రెస్ సభ్యత్వంలో కీలక పాత్ర పోషించిన ఎన్ రోలర్స్ ను ఎస్ఐఆర్ విషయంలో పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు.
ఎస్ఐఆర్ కోసం ఇంఛార్జ్‌లను నియమించాలి..
డిజిటట్ మెంబర్ షిప్ కోసం ప్రతి నియోజకవర్గంలో ఒక ఇంఛార్జ్ ను నియమించి నిరంతరం పర్యవేక్షించామని అన్నారు. ఎస్ఐఆర్ కోసం 119 నియోజకవర్గాలు, 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జ్ ల నియమించాలని సూచించారు. అసెంబ్లీ ఇంఛార్జ్ లు తప్పనిసరిగా నియోజకవర్గాల్లో ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. ఇంఛార్జ్ లు కరెక్ట్ గా పనిచేస్తే ఒక్క ఓటు కూడా డిలీట్ కాకుండా చూడొచ్చని వ్యాఖ్యానించారు. ఇంఛార్జ్ మంత్రులు ప్రతి 10 రోజులకు ఒక రోజు పార్టీ కార్యక్రమాల కోసం పూర్తిగా పనిచేయాలన్నారు. క్షేత్ర స్థాయికి వెళ్లి కార్యకర్తలను ఇంఛార్జ్ మంత్రులు కలవాలని చెప్పారు. తాను కూడా 10 రోజులకోసారి క్షేత్ర స్థాయిలో పార్టీ కార్యకర్తలను కలుస్తానని హామీ ఇచ్చారు. నెలలో మూడు రోజులు పార్టీ కార్యకర్తల కోసం సమయం ఇస్తానని.. అందరూ పార్టీ కోసం పనిచేయాల్సిందేనని అన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రతి ఒక్కరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిందేనని స్పష్టం చేశారు. ఈ విషయంలోతనతోపాటు ఎవరికి మినహాయింపు ఇవ్వొద్దని అన్నారు.
దాదాపుగా నామినేటేడ్ పోస్టులు పూర్తి..
ఎస్ఐఆర్ ప్రక్రియపై మాజీ పీసీసీ అధ్యక్షుల సలహాలు, సూచనలు తీసుకోవాలని కేడర్ కు సీఎం సూచించారు. దాదాపుగా నామినేటేడ్ పోస్టులను భర్తీ చేశామన్నారు. పార్టీ తరుపున ఇప్పుడు వేలాది మంది సర్పంచ్ లు ఉన్నారని.. మున్సిపల్ ఛైర్మన్లు, కౌన్సిలర్లు సైతం ఉన్నారని చెప్పారు. నాయకులు క్షేత్రస్థాయికి వెళ్తేనే కార్యకర్తలు బూత్ స్థాయికి వెళ్తారని చెప్పారు. రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు హైదరాబాద్ పరిధిలో బాధ్యత అప్పగించాలని సూచించారు. హైదరాబాద్ నగర పరిధిలోని 15 నియోజకవర్గాల్లో ఎస్ఐఆర్ పైన అసెంబ్లీల వారీగా సమావేశాలు పెట్టాలన్నారు. ఎస్ఐఆర్ పైన మహిళా కాంగ్రెస్ తరుపున క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించాలని సీఎం దిశానిర్దేశం చేశారు.

