ప్రజాప్రతినిధులకు ముహూర్తం.. అభివృద్ధి పనులకు మూఢమా?

కలం, కరీంనగర్ బ్యూరో: అధికారంలోకి రాకముందు ప్రతి చిన్న కార్యక్రమానికి అత్యంత నిష్ఠగా శుభ ముహూర్తాలు, పంచాంగాలు చూసుకునే నాయకులు.. అధికారిక పర్యటనలు, ప్రభుత్వ అభివృద్ధి పనుల విషయానికి వచ్చేసరికి సంప్రదాయాలను, ప్రజల సెంటిమెంట్లను పక్కనబెడుతున్నారనే విమర్శలు తీవ్రమవుతున్నాయి. 2026 పితృ పక్షాలు (మహాలయ పక్షాలు) నడుస్తున్న తరుణంలో, ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనలు (CM Revanth Tours) చేపట్టి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహించడంపై ధార్మిక వేత్తలు, ప్రతిపక్షాలు, స్థానిక ప్రజల నుండి భిన్నాభిప్రాయాలు, తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

సొంత పనులకు ముహూర్తం.. ప్రభుత్వ పనులకు పితృ పక్షాలా?

ప్రజాప్రతినిధులు తమ వ్యక్తిగత ఇళ్ల గృహప్రవేశాలు, నూతన వాహనాల కొనుగోళ్లు లేదా రాజకీయ ప్రచార వాహనాల ప్రారంభానికి అత్యంత జాగ్రత్తగా శుభఘడియలు లెక్క వేసుకుంటారు. కానీ వందల కోట్ల ప్రజాధనంతో చేపట్టే ముఖ్యమైన అభివృద్ధి పనులకు మాత్రం సంప్రదాయాలను ఎందుకు పక్కన పెడుతున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో వేములవాడ ఆలయంతో సహా 345 రూపాయల కోట్లతో అబివృద్ధి శంకుస్థాపనలు జరుపుతూ.. మరో వైపు రూ.80 కోట్లతో కరీంనగర్ (Karimnagar) నూతన కలెక్టరేట్ ప్రారంభం జరిపేందుకు స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాక దేనికనే ప్రశ్న లేవనెత్తుతోంది.

పితృ పక్షాల్లో కొత్త పనులు ప్రారంభించడం అశుభమని ప్రజల్లో బలీయమైన విశ్వాసం ఉంది. ఇటువంటి సమయంలో సీఎం చేతుల మీదుగా ప్రారంభమయ్యే ఏ ప్రాజెక్టులకైనా “గ్రహచారం” సరిగ్గా ఉంటుందా? ఇవి సకాలంలో పూర్తవుతాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రజా సంక్షేమం పేరు చెప్పి ఏళ్ల తరబడి వస్తున్న విశ్వాసాలను, ప్రజల ఆచారాలను ప్రభుత్వం కేవలం తన రాజకీయ సౌలభ్యం కోసం కాలరాస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి.

కొన్ని రోజులు ఆగితే ఏమవుతుంది?

పితృ పక్షాలు అక్టోబర్ 10న సర్వపితృ అమావాస్యతో ముగిసి, ఆ మరుసటి రోజు నుండే పవిత్రమైన “దేవీ నవరాత్రులు” ప్రారంభమవుతాయి. దేవీ నవరాత్రుల వంటి శుభ సమయంలో శంకుస్థాపనలు చేసి ఉంటే ప్రజలు, పండితులు ఎంతో సంతోషంగా స్వాగతించేవారని ప్రతిపక్ష నేతలు నిలదీస్తున్నారు. దేవీ నవరాత్రుల వరకు వేచి చూడకుండా, పితృ పక్షాల కాలంలోనే హడావుడిగా ప్రారంభోత్సవాలు చేయడం వెనుక ఏదో రాజకీయ వ్యూహం ఉందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

“రాజధర్మం” పేరుతో కప్పిపుచ్చే ప్రయత్నం

ప్రభుత్వ మద్దతుదారులు “రాజధర్మం, ప్రజాసేవ” అని సమర్థించుకుంటున్నప్పటికీ, పితృ పక్షాల్లో ప్రారంభించిన ప్రాజెక్టులు విఘ్నాలు ఎదుర్కొంటాయనే భయం స్థానికుల్లో వ్యక్తమవుతోంది. పూర్వీకులకు తర్పణాలు ఇచ్చే శోకకాలాన్ని శుభకార్యాలకు వేదికగా మార్చడం పద్ధతి కాదని సిద్ధాంతులు అభిప్రాయపడుతున్నారు. భక్తి, విశ్వాసాలు అత్యధికంగా ఉండే తెలంగాణ ప్రాంతంలో ప్రజల భావోద్వేగాలను, ఆచారాలను పరిగణనలోకి తీసుకోకుండా యంత్రాంగం షెడ్యూల్ ఖరారు చేయడంపై అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రజాస్వామ్యంలో అభివృద్ధి అవసరమే.. కానీ అది ప్రజల సంప్రదాయాలను, భక్తి విశ్వాసాలను గాయపరిచేలా ఉండకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సొంత విషయాల్లో రాహుకాలం, దుర్ముహూర్తం పాటించే నేతలు.. ప్రజా ప్రాజెక్టుల విషయంలో “పితృ పక్షాల” పవిత్రతను విస్మరించడం వారి ద్విపాత్రాభినయానికి నిదర్శనమని విమర్శకులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పితృ పక్షాల్లో కాకుండా, దేవీ నవరాత్రుల శుభ సమయాన అభివృద్ది పనులను ప్రారంభించాలని పలువురు కోరుతున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయంలో భాగమైన రాజన్న సిరిసిల్ల స్థానిక ఎమ్మెల్యే కెటిఆర్ ను టార్గెట్ చేయడంతో పాటు సిద్దిపేట, గజ్వేల్ ను టార్గెట్ చేస్తామన్న వ్యాఖ్యలపై ప్రజల్లో భిన్నాబిప్రాయాలు వ్యక్తమవతున్నాయి. ఈ సభ నాయకులు చెప్పినట్లుగా ఉత్తర రాజకీయాల్లో మార్పు తెస్తుందా లేదా? చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>