కలం, ఖమ్మం బ్యూరో: గోదావరి అలల పవిత్ర సవ్వడితో, నిరంతరం మారుమోగే రామనామ స్మరణతో పులకించే భద్రాచలం(Bhadrachalam) దివ్యక్షేత్రం మహారూపాంతరానికి వేదికవుతోంది. దశాబ్దాలుగా కోట్లాది మంది భక్తుల విశ్వాసానికి ప్రతీకగా నిలిచిన ఈ క్షేత్రానికి పూర్వ వైభవం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం బృహత్తర పునర్నిర్మాణ పనులు చేపట్టింది. కాంక్రీట్ నిర్మాణాలకు బదులుగా తరతరాల పాటు నిలిచే రాతి కట్టడాలతో ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఆలయ ప్రాంగణంలో శ్రీ సీతారామచంద్రస్వామివారి ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలు, ఆళ్వార్లు, అమ్మవార్ల సన్నిధులు, భక్తరామదాసు ప్రాంగణాలను రాతి శిల్పాలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు.
గతంలో తూర్పు, ఉత్తర భాగాలకే పరిమితమైన ప్రథమ ప్రాకారాన్ని దక్షిణ భాగానికి కూడా విస్తరిస్తున్నారు. ఇందుకోసం ‘గోకుల రామం’ ప్రాంగణం శిల్పశాలగా మారింది. దూర ప్రాంతాల నుంచి వచ్చిన శిల్పులు రాతిని సున్నితంగా మలుస్తూ శిల్పకళా వైభవాన్ని సాకారం చేస్తున్నారు. ఈ నిర్మాణ పనులు శ్రీ పాంచరాత్రాగమ శాస్త్ర నియమాలు, శ్రీవైష్ణవ సంప్రదాయాలకు అనుగుణంగా కొనసాగుతున్నాయి. ముఖ్యంగా ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు దర్శించే వైకుంఠ ద్వార మండపాన్ని కళ్యాణ మండపం తరహాలో రాతి శిల్పాలతో నిర్మిస్తున్నారు. ఈ పనులను డిసెంబరు నాటికి పూర్తి చేసేందుకు వేగం పెంచారు.
పుష్కరాలకు సర్వసన్నద్ధం
2027 జూన్ 26 నుంచి జులై 7 వరకు జరగనున్న గోదావరి పుష్కరాలను (Godavari Pushkaralu) దృష్టిలో ఉంచుకుని భద్రాచలంలో మౌలిక వసతుల అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. 2003లో 30 లక్షలు, 2015లో 50 లక్షల మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో ఈసారి కోటి మంది వరకు భక్తులు వచ్చే అవకాశం ఉందనే అంచనాతో ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలు అమలు చేస్తోంది. రూ.276 కోట్ల అంచనా వ్యయంతో ఆలయ విస్తరణ పనులు చేపడుతున్నారు. ప్రసాదాల తయారీ విభాగాలు, విక్రయ కౌంటర్లను కూడా పెంచుతున్నారు.
ఘాట్ల అభివృద్ధి
గోదావరి స్నాన ఘాట్లను కూడా ఆధునిక వసతులతో అభివృద్ధి చేస్తున్నారు. రూ.46.7 కోట్లతో ప్రధాన ఘాట్‌కు ఇరువైపులా కొత్త ఘాట్లు, షెడ్లు, దుస్తులు మార్చుకునే గదులను నిర్మిస్తున్నారు. కరకట్టను వెడల్పు చేసి రామాయణ ఘట్టాలను కొత్త రూపాల్లో చెక్కుతున్నారు. పర్యాటకులు ఫొటోలు తీసుకునేందుకు ప్రత్యేక హంగులు కల్పిస్తున్నారు. కరకట్ట దిగువ భాగంలో రూ.90 లక్షలతో రహదారి అభివృద్ధి పనులు చేపడుతున్నారు. గోదావరిలో హంస వాహన విహారాన్ని మరింత ఆకర్షణీయంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
రహదారులు, డ్రెయినేజీపై దృష్టి
రామాలయం నుంచి చప్టా దిగువన ఉన్న శ్రీయోగానంద లక్ష్మీనరసింహస్వామి ఆలయ వీధిని ప్రధాన ఘాట్ వరకు విస్తరిస్తున్నారు. ప్రస్తుతం 25 అడుగులుగా ఉన్న రహదారిని 50 అడుగులకు పెంచుతున్నారు. దీంతో రద్దీ సమయంలో భక్తులు నేరుగా గోదావరి కరకట్టకు చేరుకునే అవకాశం ఉంటుంది. బాధితులకు తగిన పరిహారం అందిస్తూ విస్తరణ పనులు పూర్తి చేసేందుకు అధికారులు సమీక్షలు నిర్వహిస్తున్నారు.
గోదావరి నది పవిత్రతను కాపాడేందుకు మురుగునీరు నేరుగా నదిలో కలవకుండా కంబాలపాడు సమీపంలో రూ.35 కోట్లతో ఎస్టీపీ శుద్ధీకరణ వ్యవస్థను నిర్మిస్తున్నారు. ఆలయ పరిసరాల్లో రూ.5 కోట్లతో అంతర్గత డ్రెయిన్లు, ఘన వ్యర్థాల నిర్వహణ పనులు చేపడుతున్నారు. రహదారులు-భవనాల శాఖ, పోలీస్, గ్రామ పంచాయతీ తదితర శాఖల సమన్వయంతో భద్రాచలంలో అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. శిల్పుల నైపుణ్యం, ప్రత్యేక బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ క్షేత్రం 2027 గోదావరి పుష్కరాల నాటికి మరింత వైభవాన్ని సంతరించుకునేలా పనులు సాగుతున్నాయి.

