కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఆదివారం కూడా కొనసాగనున్నాయి. ఉదయం 10 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయి. తొలుత డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) విద్యుత్ సంస్థల వార్షిక నివేదికను అసెంబ్లీకి సమర్పిస్తారు. అనంతరం ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే గోవింద్ నాయక్ మృతిపై సభ్యులు సంతాపం తెలుపుతారు. ఆ తరువాత వ్యాట్ సవరణ బిల్లును సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) అసెంబ్లీలో ప్రవేశపెడతారు. హెట్ స్పీచ్ అండ్ హేట్ క్రైమ్ నిరోధక బిల్లును సైతం సీఎం ప్రవేశపపెట్టనున్నారు. ఇక ఇవాళ బడ్జెట్లో విద్యాశాఖకు కేటాయింపుల పద్దులపై చర్చ జరగనుంది. వైద్య, ఆర్అండ్బీ, ఇరిగేషన్ పద్దులపై శాసన సభలో ఓటింగ్ జరగనుంది.
ఇక శనివారం అసెంబ్లీలో మైనింగ్ శాఖపై చర్చించారు. అధికార, ప్రతిపక్ష మాటల తూటాలతో సభ దద్ధరిల్లిపోయింది. బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు.. కంచె చేను మేసినట్లుగా కాంగ్రెస్ మంత్రుల తీరు ఉందని, రాష్ట్ర ఖజానాకు భారీగా గండి పడుతోందని ఆరోపించారు. జీవో 111 ఉల్లంఘన జరిగిందన్నారు. శంషాబాద్ కోత్వాల్‌గూడలో రాఘవ కన్స్‌ట్రక్షన్స్ అక్రమ మైనింగ్ చేస్తోందని ఆరోపించారు. ఎలాంటి పర్మిషన్లు, లైసెన్సులు లేకుండా డీజిల్ జనరేటర్లతో దర్జాగా స్టోన్ క్రషర్ దందా చేస్తోందని ఆరోపించారు. అధికారులు రెండుసార్లు పట్టుకున్నా, నోటీసులు ఇచ్చినా రాఘవ కన్స్‌ట్రక్షన్స్‌పై యాక్షన్ ఏదీ? అంటూ మండిపడ్డారు. నిబంధనల ప్రకారం రూ. 25 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష ఎందుకు వేయలేదు? అని ప్రశ్నించారు. సుమారు గంటపాటు ఇదే అంశంపై చర్చ జరిగింది.
హరీశ్ రావు వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. సభలోనే హరీశ్ రావుకు కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ ఏర్పడ్డనాటి నుంచి (2014 జూన్ 2వ) నేటి రాష్ట్రంలో జరిగిన మైనింగ్ మాఫియా అక్రమాలపై సీబీసీఐడీతో విచారణ చేయిస్తామంటూ సీఎం ప్రకటించారు. సిరిసిల్ల జిల్లా నేరెళ్ల ఇసుక దందాలో మాజీ ఎంపీ సంతోష్‌రావు, ఆయన తండ్రి రవీందర్‌రావుపై, గ్రానైట్ అక్రమ మైనింగ్‌లో మాజీ మంత్రి గంగుల కమలాకర్ కంపెనీపై, మైనింగ్ లీజు మాఫియాలో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కంపెనీపై, హరీశ్ రావు తమ్ముడు మహేశ్‌రావు మైనింగ్ దోపిడీపై ప్రతిపక్షం ఆరోపిస్తున్న రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌పైనా సీబీసీఐడీతో సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డిని భయపెట్టి అక్రమ పనులు చేయించుకోవాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారని అన్నారు. ఆయన ఒప్పుకోకపోవడం వల్లనే అనవసర ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.

