కలం, వరంగల్ బ్యూరో : కాళేశ్వరంలో దోషులు ఎంతటి వారైనా వదిలేది లేదని.. దోషులను శిక్షించేందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళతామని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. సోమవారం జయశంకర్ భూపాలపల్లిలోని కాళేశ్వరంలో పర్యటించిన ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గోదావరి జలాలతో ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేయాలని 1975 లో జలగం వెంగళ రావు ఆనాటి మహారాష్ట్ర సీఎంతో ఒప్పందం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత వైఎస్ హయాంలో 2009 లో 38, 063 కోట్లతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును మొదలు పెట్టారన్నారు. ప్రాణహిత చేవెళ్లకు రూ. 11,700 కోట్లు ఖర్చు చేశారని, ప్రాణహిత చేవేళ్లతో ఆర్ధిక, రాజకీయ ప్రయోజనం లేదని కెసీఆర్ రిడిజైనింగ్ పేరుతో ఊరు, పేరు అంచనాలు మార్చి.. రూ.1 లక్షా 50 వేల కోట్లకు పెంచారని తెలిపారు. 2016లో మొదలు పెట్టిన మేడిగడ్డను 2019లో పూర్తిచేస్తామని ప్రారంభించి నిర్లక్ష్యం చేశారన్నారు.
ఇది అద్భుతమని భ్రమలు కల్పించి 2018 ఎన్నికల్లో రాజకీయ లబ్ది పొందారని సీఎం (CM Revanth Reddy) విమర్శించారు. 2023లో మేడిగడ్డ కుప్పకూలిందని, అన్నింటిని దాచిపెట్టి 2023 ఎన్నికల్లో ప్రయోజనం పోందాలనుకున్నారని సీఎం ఆరోపించారు. దాచినా దాగని నిజాలను ప్రకృతి బయటపెట్టిందని పేర్కొన్నారు. ప్రాజెక్టులో సమస్యలు రాగానే 2023, నవంబర్ 1 న NDSA ప్రాథమిక రిపోర్ట్ కెసీఆర్ సీఎంగా ఉన్నప్పుడే ఇచ్చిందన్నారు. ఆ నివేదికను కెసీఆర్ పట్టించుకోలేదని, ఈ దోపిడీపై పీసీ ఘోష్ కమిటీ సంపూర్ణ నివేదిక ఇచ్చిందన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని కేంద్రానికి తీర్మానం పంపిందని తెలిపారు. కేసీఆర్, హరీష్ ను జైల్లో వేయాలని, ఈ కేసును సీబీఐ కి అప్పగించడంపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు.
కాళేశ్వరంతో ఇప్పటి వరకు లక్ష ఎకరాలకు కూడా నీరు ఇవ్వలేకపోయారని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును రిపేర్ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం సంకల్పించిందని, నెల రోజుల ముందే అధికారులతో, సాంకేతిక నిపుణులతో ఇవాళ సమావేశం పెట్టుకున్నట్లు తెలిపారు. నిజాలు బయట పడతాయని తెలిసి ఇవాళ కావాలని వాళ్లు పొలిటికల్ మీటింగ్ పెట్టుకున్నారని ఆరోపించారు. అయినా తాము అనుమతులు ఇచ్చామన్నారు. ఎల్లంపల్లి నీటితోనే రాష్ట్రంలో అత్యధిక పంట పండించారని తెలిపారు. కాళేశ్వరం విచారణపై సిబిఐ ఎందుకు మౌనంగా ఉందో చెప్పాలన్నారు. తాము పదే పదే లేఖలు రాసినా ఎందుకు స్పందిచడం లేదని సీఎం ప్రశ్నించారు.

