కలం, వెబ్ డెస్క్: కొడంగల్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలనేదే తన కల అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. ఇక్కడ ఏర్పాటు కాబోతున్న ఇండస్ట్రియల్ హబ్ ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయని వివరించారు. కొడంగల్ నియోజకవర్గంలోని హకీంపేటలో వంద మంది పారిశ్రామికవేత్తలతో జరిగిన సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడారు. డిసెంబర్ 2027 నాటికి శంషాబాద్ నుంచి కొడంగల్ వరకు రేడియల్ రోడ్డు నిర్మాణం పూర్తవుతుందని.. కేవలం 70 నిమిషాల్లోనే చేరుకోచ్చన్నారు. ఎయిర్‌పోర్టుకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో పారిశ్రామిక అభివృద్ధి బాగా జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా కొడంగల్ ఇండస్ట్రియల్ హబ్, నారి పార్క్, త్రైవ్ హబ్, రైజ్ పార్కులను వర్చువల్‌గా ముఖ్యమంత్రి ఆవిష్కరించారు.
250 ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్..
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కొడంగల్ ప్రాంతాన్ని గొప్ప పారిశ్రామిక హబ్‌గా తీర్చిదిద్దడం తన బాధ్యత అన్నారను. కొడంగల్తోనే తనకు గుర్తింపు, ఆత్మగౌరవం లభించిందన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో అనువైన ప్రాంతమని, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. ఇప్పటికే పలు కంపెనీలు ఈ ఇండస్ట్రియల్ హబ్‌లో నిర్మాణాలు చేపడుతుండటంతో మరిన్ని పరిశ్రమలు పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం సంతోషంగా ఉందన్నారు.
250 ఎకరాల్లో కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్ రూపుదిద్దుకుంటోందని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. విదేశీ సంస్థలు ఎక్కడ పెట్టుబడులు పెట్టాలన్నా అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఇండస్ట్రియల్ పార్క్ ఎంత దూరంలో ఉందో చూస్తారని అన్నారు. రానున్న కాలంలో చందన్వెల్లి, సీతారాంపూర్, పరిగి, కొడంగల్ ప్రాంతాలు గొప్ప పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతాయని చెప్పారు. కొడంగల్ వ్యూహాత్మక ప్రాంతమని, కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు తక్కువ దూరంలో ఉండడం విశేషమని తెలిపారు.

