కలం, నల్లగొండ: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ నెల 28వ తేదీన నల్లగొండ (Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు కీలక ప్రాజెక్టులకు ఆయన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇప్పటికే నల్లగొండలో అన్ని ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షించారు.
హైదరాబాద్ నుండి హెలికాప్టర్ లో బయలుదేరి సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) నేరుగా నల్లగొండ జిల్లా కనగల్ మండలానికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో కనగల్ మండలం ఏఎంసీ మార్కెట్ యార్డు వద్దకు సీఎం చేరుకుంటారు. అక్కడ రూ. 13 వేల కోట్ల భారీ వ్యయంతో నిర్మించ తలపెట్టిన ఆర్ అండ్ బీ ‘హ్యామ్’ రోడ్ల పనులకు సంబంధించి పైలాన్‌ను ఆయన ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ (Nalgonda Corporation) పరిధిలో మొదటి ఫేజ్ కింద ప్రజలకు సురక్షితమైన తాగునీరు అందించే పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
ఈ కార్యక్రమాల అనంతరం నల్లగొండ పట్టణంలోని ఎన్జీ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనంతరం జిల్లాలోని స్వయం సహాయక బృందాల మహిళా సంఘాలకు ప్రభుత్వం తరపున ఆర్థిక సాయానికి సంబంధించిన నమూనా చెక్కులను సీఎం చేతుల మీదుగా అందజేయనున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అన్ని రకాల భద్రతా, రవాణా ఏర్పాట్లను పూర్తి చేసింది. కాంగ్రెస్ శ్రేణులు కూడా ఈ సభను భారీ ఎత్తున విజయవంతం చేయడానికి సన్నద్ధమవుతున్నారు.
Read Also: రైతులకు సోలార్ ‘పంట’.. త్వరలో పైలట్ ప్రాజెక్టు ప్రారంభం
Follow Us On: Instagram

