కలం, వెబ్ డెస్క్: ఇంటర్ ప్రవేశాలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ ఏడాది యథావిధిగా అడ్మిషన్లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రవేశాలకు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శేషాద్రి, స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి, సీఎం సెక్రటరీ మాణిక్ రాజ్, విద్యా శాఖ కమిషనర్ యోగితా రాణాతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యార్థుల ప్రయోజనాలకు భంగం వాటిల్లకుండా వెంటనే ప్రవేశాల ప్రక్రియను చేపట్టాలని
సూచించారు.
పదితోనే చదువు ఆపేస్తుండటంతోనే..
ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి సీబీఎస్ఈలో మాదిరే 11, 12వ తరగతులు నిర్వహించాలని.. ఫలితంగా డ్రాపౌవుట్స్ సంఖ్య గణనీయంగా తగ్గుతుందని తెలంగాణ విద్యా కమిషన్ ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజారిటీ రాష్ట్రాలు 11, 12వ తరగతుల విధానాన్ని అనుసరిస్తున్నాయి. అయితే, తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్య వేరుగా ఉంది. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు.. ఇంటర్ కోసం కాలేజీలకు వెళ్లాల్సి ఉండటంతో అక్కడితో చదువు ఆపేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్‌ను వేరుగా కాకుండా పదితో పాటు 11, 12 తరగతులుగా కొనసాగించాలని సీఎం రేవంత్ రెడ్డి గతంలో అధికారులకు సూచించారు. ఇదే అంశాన్ని తెలంగాణ విద్యా కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొంది.
తల్లిదండ్రుల ఆందోళనతో వెనక్కి..
ఇటీవల ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివేస్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి ఆందోళన వ్యక్తమైంది. విలీనంతో ముడిపడిన పలు సాంకేతిక సమస్యలను పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉండటంతో ఈ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేయాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించారు. భాగస్వాములతో విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించాలని ఆదేశించారు. ఇదే సమయంలో తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీపై నియమించిన కమిటీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. శాసనసభలో చర్చించాకే తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

