శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీకి సీనియర్ ప్లేయర్ ఫిదా!

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్ 2026లో గుజరాత్ టైటాన్స్ అదరగొడుతోంది. శుభ్‌మన్ గిల్ కెప్టెన్సీలో గుజరాత్ వరుస విజయాలతో దూసుకుపోతోంది. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ తన సత్తా చాటుకుంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా అన్ని విభాగాల్లో తమదైన మార్క్ చూపింది. రాజస్థాన్‌ను అన్ని విభాగాల్లో ఉక్కిరిబిక్కిరి చేసి 77 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ సందర్బంగా శుభ్‌మన్ గిల్ (Shubman Gill) కెప్టెన్సీపై టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ (Irfan Pathan) ప్రశంసల వర్షం కురిపించాడు.

గిల్ తీసుకున్న తెలివైన నిర్ణయాల వల్లే ఈ విజయం సాధ్యమైందని ఇర్ఫాన్ పఠాన్ కొనియాడారు. ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 229 పరుగుల భారీ స్కోరు చేసింది. ఇందులో కెప్టెన్ గిల్ కేవలం 44 బంతుల్లోనే 84 పరుగులు చేసి జట్టుకు మంచి పునాది వేశారు. అనంతరం 230 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ రాయల్స్.. గుజరాత్ బౌలర్ల దాటికి 152 పరుగులకే కుప్పకూలింది. దీంతో గిల్ సేన 77 పరుగుల భారీ తేడాతో గెలుపొందింది.

ఈ మ్యాచ్ అనంతరం ఇర్ఫాన్ పఠాన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో గిల్ కెప్టెన్సీని విశ్లేషించారు. టాస్ సమయంలో ప్రసిద్ధ్ కృష్ణను ఆడిస్తానని చెప్పిన గిల్, మ్యాచ్ సాగుతున్న కొద్దీ పిచ్ పరిస్థితులను గమనించి తన ప్లాన్ మార్చుకున్నారని పఠాన్ పేర్కొన్నారు. పిచ్ స్పిన్నర్లకు సహకరిస్తోందని గ్రహించిన గిల్, ప్రసిద్ధ్‌ను తక్కువగా వాడుకొని ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయి కిషోర్‌ను రంగంలోకి దించారని చెప్పారు. అలాగే వాషింగ్టన్ సుందర్‌ను కూడా సమర్థవంతంగా ఉపయోగించుకున్నారని ఆయన వివరించారు.

ఒక బ్యాటర్‌గా పిచ్‌పై ఉన్న పట్టును అర్థం చేసుకోవడం, కెప్టెన్‌గా సరైన నిర్ణయాలు తీసుకోవడంలో గిల్‌కు బాగా ప్లస్ అయిందని పఠాన్ అభిప్రాయపడ్డారు. గుజరాత్ సపోర్ట్ స్టాఫ్ మరియు ఆశిష్ నెహ్రా సహకారం ఉన్నప్పటికీ, మైదానంలో జట్టుపై గిల్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోందని ఆయన ప్రశంసించారు. ప్రస్తుతం 11 మ్యాచ్‌లలో 14 పాయింట్లతో గుజరాత్ టైటాన్స్ ప్లే ఆఫ్ రేసులో బలంగా దూసుకుపోతోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>