కలం, వెబ్‌డెస్క్: సొంత ప్రభుత్వంపై విమర్శలతో తరచూ వార్తల్లో నిలిచే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Raj Gopal Reddy)పై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఘాటుగా స్పందించారు. సిద్ధిపేటలో నేడు జరిగిన బహిరంగ సభలో రాజగోపాల్ రెడ్డికి పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు. తమ పార్టీలో కొందరు వ్యక్తులు పిచ్చి కుక్క కరిచినట్లు మాట్లాడుతున్నారని రేవంత్ అన్నారు. చెడు అంతా బహిరంగంగా మాట్లాడి, మంచి మాత్రం తనకు చెవిలో చెబుతున్నారని వ్యాఖ్యానించారు. వారిని త్వరలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఎర్రగడ్డ ఆస్పత్రికి తీసుకెళ్తారని అన్నారు. పార్టీలో సీనియర్ నాయకుడిని ఉద్దేశించి సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో, రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి.
రాజగోపాల్ రెడ్డి ఏమన్నారంటే..
సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth)కి అదృష్టం కలిసి వచ్చిందని, అందుకే సీఎం అయ్యారని రాజగోపాల్ రెడ్డి ఇటీవల ఓ కార్యక్రమంలో అన్నారు. సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్‌తో పాటు మునుగోలు, ములుగు, ఆదిలాబాద్ వంటి వెనుకబడిన ప్రాంతాలను కూడా చూసుకోవాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్ అని, డిప్యూటీ సీఎం మధిర అని, ఉత్తమ్ కుమార్ రెడ్డి హుజూర్నగర్ అని వాళ్ల నియోజకవర్గాలనే చూసుకుంటున్నారని విమర్శించారు. మరి ఇతర నియోజకవర్గాలకు నిధులు, అభివృద్ధి మాటేంటని ప్రశ్నించారు. రూ.10 వేల కోట్లు కొడంగల్‌కు తీసుకుపోతున్న నేపథ్యంలో తమ నియోజకవర్గానికి కూడా ఒక రూ.500 కోట్లు ఇవ్వాలని కోరినట్లు చెప్పారు. రిప్రజెంటేషన్ ఇస్తామంటే పట్టించుకోరు అని, బహిరంగంగా అడిగితే క్రమశిక్ష కమిటీ అంటున్నారని వ్యాఖ్యానించారు.
రాజగోపాల్ రెడ్డిపై పీసీసీ ఇప్పటికే ఆగ్రహంగా ఉంది. ఏఐసీసీకి కూడా ఫిర్యాదు చేసింది. ఆయన మాట్లాడిన మాటలను వీడియో రూపంలో ఏఐసీసీకి పంపినట్లు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. తాజాగా సీఎం కూడా సీరియస్ కావడంతో రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఏ మలుపు తిరుగుతుందోనని చర్చ నడుస్తోంది.
Also Read : బీజేపీలోకి హరీశ్ రావు.. ఒట్టేయాలని రేవంత్ సవాల్
Follow Us On: Youtube

