పేదల ఇండ్లు కూల్చడం మా ఉద్దేశం కాదు : సీఎం రేవంత్

కలం, వెబ్ డెస్క్ : తాను హైడ్రా తీసుకొచ్చినప్పుడు ఎంతో మంది విమర్శించారని.. కానీ పేదల ఇండ్లు కూల్చడం తమ ఉద్దేశం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy). కబ్జాలకు గురవుతున్న చెరువులు, కుంటలను కాపాడి.. ముంపు బాధితులు లేకుండా చూడటమే ప్రభుత్వ లక్ష్యం అని రేవంత్ తెలిపారు. కూకట్ పల్లిలోని నల్ల చెరువు (Nalla Cheruvu) ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం హోదాలో మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని కూకట్ పల్లికి (Kukatpally) రావడం సంతోషంగా ఉందని చెప్పారు. ‘ఈ మల్కాజిగిరి కోసం రాజకీయాలకు అతీతంగా అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తాను. రాజకీయాలకు మా ప్రభుత్వం అతీతంగా పనిచేస్తోంది. అభివృద్ధి మా ప్రధాన లక్ష్యం’ అని సీఎం రేవంత్ తెలిపారు.

తాను చెరువుల పునరుద్ధరణ కోసం హైడ్రా (Hydraa) తీసుకొస్తే.. ఎంతో మంది తిట్టారని.. కానీ నల్ల చెరువు అభివృద్ధి వల్ల ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూస్తే ఆ విమర్శలు ఆశీర్వాదంగా అనిపిస్తున్నాయని చెప్పారు. ‘చెరువుల పునరుద్ధరణ పేరుతో పేదల ఇండ్లు కూల్చుతున్నామని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. కానీ మా ప్రభుత్వం పేదల ప్రభుత్వం. వారి ఇండ్లు కూల్చడం మా ఉద్దేశం కాదు. ముంపు ప్రాంతాలు, ముంపు బాధితులు లేకుండా చూడాలన్నదే మా ఆశయం’ అన్నారు సీఎం రేవంత్.

న్యాయం చేస్తాం..

చెరువులు, నాలాలు ఆక్రమించుకున్న వారికి న్యాయం చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం హామీ ఇచ్చారు. నిర్వాసితుల్లో అర్హులైన నిరుపేదలు ఉంటే వారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు ఇస్తామన్నారు. పునరుద్ధరించిన చెరువుల వద్ద మహిళలకు స్టాల్స్ ఏర్పాటు చేసుకునే ఛాన్స్ ఇస్తామన్నారు. చిన్నారుల కోసం చెరువల ఒడ్డున ఆటస్థలాలు అభివృద్ధి చేస్తామని తెలిపారు. దేశంలోని అన్ని నగరాలు చెరువులు, నాలాలు ఆక్రమణలకు గురి కావడంతో సతమతం అవుతున్నాయని.. అందుకే హైదరాబాద్ లో అలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నట్టు తెలిపారు.

తల తాకట్టు పెట్టైనా నిధులిస్తా..

హైదరాబాద్ ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుందామని.. అందుకోసం ఎన్ని నిధులైనా తల తాకట్టు పెట్టి తీసుకొస్తానని సీఎం రేవంత్ చెప్పారు. ‘కోర్ అర్బన్ రీజియన్ లో ఉన్న చెరువులు మొత్తం పునరుద్ధరించుకుందాం. నాలాలు, కుంటల ఆక్రమణలు తొలగించుకుందాం. రోడ్ల విస్తరణ చేస్తాం. మారుతున్న అభివృద్ధికి అనుగుణంగా సౌకర్యాలు ఏర్పాటు కావాలి. కాబట్టి అభివృద్ధిని ఎవరూ అడ్డుకోవద్దు. ఎలాంటి సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు ఈ ప్రజలే నన్ను నిలబెట్టారు. కాబట్టి మీ కోసం అభివృద్ధి చేయడానికి వెనకడుగు వేయను’ అని సీఎం రేవంత్ (Revanth Reddy) చెప్పుకొచ్చారు.

మూసీ నది అభివృద్ధిని అడ్డుకోవద్దు..

మూసీ నదిని పునరుద్ధరించకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవని సీఎం రేవంత్ చెప్పారు. కావాలనే బీజేపీ, బీఆర్ ఎస్ నేతలు మూసీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని ఆరోపించారు. మూసీ నిర్వాసితుల్లో అర్హులైన వారికి న్యాయం చేస్తామని చెప్పారు. ఏ సమస్య ఉన్నా తనకు చెప్పాలని కోరారు. బీజేపీ ప్రభుత్వాలు గంగా, సబర్మతి, సరయూ నదులను పునరుద్ధరించాయని.. కానీ ఇక్కడ మూసీ అభివృద్ధిని అడ్డుకోవడం దారుణం అని సీఎం రేవంత్ వెల్లడించారు.

Read Also: ఇరాన్ లో వార్.. ఇక్కడ బేజార్

Follow Us On : WhatsApp

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>