కలం, వెబ్ డెస్క్: కేసీఆర్ ఫ్యామిలీది జస్టిస్ అయితే.. తనది సోషల్ జస్టిస్ అని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ నెక్లస్ రోడ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. కేసీఆర్ ది దొరల న్యాయం అయితే.. తనది సామాజిక న్యాయం అని పేర్కొన్నారు. వైఎస్, డీఎస్ ఎలాగో.. తనది, మహేశ్ కుమార్ గౌడ్ ది అలాంటి కాంబినేషన్ అంటూ చెప్పుకొచ్చారు. తమ కాంబినేషన్ లో 2029లోనూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 117 సీట్లు రావడం ఖాయమని అన్నారు.
ప్రజా పాలనపై దుష్ప్రచారం చేస్తున్నారు..
పదేళ్లు రాష్ట్రాన్ని పరిపాలించిన వారు ప్రజాపాలన గురించి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాజ్యం వాళ్లు చేసి.. కులవృత్తులు చేసుకోవాలని గత పాలకులు ప్రజలకు చెప్పారని విమర్శించారు. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేస్తే ఆయన కొడుకు కేటీఆర్ మంత్రి అయ్యాడని అన్నారు. తనను సీఎం చేస్తే బీసీ బిడ్డ పొన్నం ప్రభాకర్ మంత్రి అయ్యారని చెప్పారు. కేసీఆర్ 1,000 ఎకరాల్లో ఫామ్ హౌజ్ కట్టుకుంటే.. తాను మాత్రం పేద ప్రజల కోసం ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇండ్లు కట్టిస్తున్నానని అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పదేండ్లలో కేసీఆర్ చేసిన అప్పే తమ ప్రాణానికి ముప్పుగా మారిందని దుయ్యబట్టారు. కేసీఆర్ వల్ల రూ.75 వేల కోట్లు ఏటా రాష్ట్ర అప్పులు కడుతున్నాయని అన్నారు. మిగిలిన డబ్బుతోనే సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావాలంటే గౌడ కులస్తుల సహకారం కావాలని విజ్ఞప్తి చేశారు.

