కలం, వెబ్ డెస్క్: కమ్యూనిస్టుల పోరాటాలతోనే దేశంలో పేదలకు అనేక రకాలుగా న్యాయం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. పోరాటం కమ్యూనిస్టులది, పరిష్కారం కాంగ్రెస్ ప్రభుత్వాలది అన్నట్లు పరిస్థితి మారిందన్నారు. రవీంద్ర భారతిలో ప్రముఖ రైతాంగ ఉద్యమ నేత, కామ్రేడ్ సారంపల్లి మల్లారెడ్డి సంస్మరణ సభలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
సిరిసిల్ల, జగిత్యాల రైతాంగ పోరాటాల నుంచి నేటి వరకు కూడా కార్మిక, పేదల సమస్యలపై కమ్యూనిస్టుల పోరాటాలే ప్రభుత్వాలకు పరిష్కార దిక్సూచిగా మారాయని సీఎం రేవంత్ అన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారంలో సారంపల్లి మల్లారెడ్డి కృషి అపారమన్నారు. ఆయన పేరును రాష్ట్రంలోని ఒక వ్యవసాయ సంస్థకు పెట్టాలని తనకు వినతులు వస్తున్నట్లు వివరించారు. దీనిపై మంత్రి వర్గంలో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు.
మోదీ ప్రమాదకరమైన వ్యక్తి..
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులకు వ్యతిరేకంగా పనిచేస్తూ కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ దేశానికి అత్యంత ప్రమాదకరమైన వ్యక్తి మోదీ అని, ఆయన ఓటమే లక్ష్యంగా కమ్యూనిస్టులు పనిచేయాలని కోరారు. వందేళ్ల కమ్యూనిస్టుల చరిత్రను పరిశీలిస్తే.. ఎర్ర జెండా పేదోడి జెండాగా మారిపోయిందన్నారు. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాల వెనుక ఎర్ర జెండా ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. అందుకే తనకు కమ్యూనిస్టులంటే ఎంతో అభిమానమన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వారు మరింత బలమైన పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు.

