కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ ప్రధాన గేటు వద్ద పోలీసులు తన చీరను లాగేందుకు ప్రయత్నించారని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి (Sunitha Lakshma Reddy) కన్నీటి పర్యంతమయ్యారు. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. మహిళా ప్రజాప్రతినిధి పట్ల ఇలా జరగడం అత్యంత బాధాకరమన్నారు. అసెంబ్లీకి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో పోలీసులు తనను అడ్డుకున్నారని, ఆ క్రమంలో తన చీరను లాగేందుకు ప్రయత్నించారని సునీతా లక్ష్మారెడ్డి ఆరోపించారు.
ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు..
ఈ సందర్భంగా సునీతా లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. “మహిళా ఎమ్మెల్యే అని కూడా చూడకుండా ఇలా ఎలా వ్యవహరిస్తారు?” అంటూ పోలీసులను ప్రశ్నించారు. అసెంబ్లీ ప్రాంగణం వద్ద మహిళా ప్రజాప్రతినిధికి జరిగిన అవమానంగా ఈ ఘటనను అభివర్ణించారు. తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితిని ఎన్నడూ ఎదుర్కోలేదని పేర్కొన్నారు. ఉమ్మడి ఏపీలో కూడా ఇలా జరగలేదన్నారు. అసెంబ్లీ సాక్షిగా మహిళా ఎమ్మెల్యే పట్ల అవమానకరంగా వ్యవహరించడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు. ఇదిలా ఉంటే, అసెంబ్లీ గేటు వద్ద ఓ మహిళా కానిస్టేబుల్ సునీతా లక్ష్మారెడ్డికి క్షమాపణలు చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత..
తొలి రోజు సభా సమావేశాల సందర్భంగా సోమవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ వైఫల్యాలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నల్లచొక్కాలు ధరించి అసెంబ్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్ రావు సహా పలువురు పార్టీ ఎమ్మెల్యేలను పోలీసులు ప్రధాన గేటు వద్దే అడ్డుకున్నారు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగి, ఘర్షణ వాతావరణం నెలకొంది. అనంతరం కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేసి తెలంగాణ భవన్‌కి తరలించాయి.

