కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా గద్వాల్ విజయలక్ష్మి (Gadwal Vijayalakshmi) పదవీ బాధ్యతలు చేపట్టారు. ప్రజా భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు డాక్టర్ కే కేశవరావు, వి.హనుమంతరావు హాజరయ్యారు. తొలుత పూజా కార్యక్రమాలు నిర్వహించిన విజయలక్ష్మి.. ఫైల్‌పై సంతకం చేశారు. బాధ్యతలు స్వీకరించాక.. ప్రజావాణి హాల్‌కి వెళ్లి వినతుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రణాళిక శాఖ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్, ప్రజావాణి స్టేట్ నోడల్ ఆఫీసర్ విద్యాసాగర్ తదితరులు పాల్గొన్నారు.
ముచ్చటగా మూడో పదవి..
గద్వాల్ విజయలక్ష్మి ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలు కావడంతో ఇప్పటివరకు మూడు పదవులు అలంకరించారు. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ నగర మేయర్‌గా పనిచేశారు. పదవీ కాలం ముగిశాక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నియమించింది. ఆ పదవిలో ఉండగానే.. కేబినెట్ ర్యాంకుతో ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షురాలిగా నియమితులు అయ్యారు. ఈ పదవిలో ఉన్న చిన్నారెడ్డిని ప్రభుత్వం తప్పించడంతో విజయలక్ష్మిని ఇక్కడ నియమించారు. అదే సమయంలో రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను ఎంపిక చేశారు.

