కలం, తెలంగాణ బ్యూరో : పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టుకు సంబంధించి భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఆ జిల్లా ప్రజా ప్రతినిధులు దగ్గరుండి యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. జిల్లా సాగునీటి ప్రాజెక్టుల తాజా స్టేటస్‌పై మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రధాన కార్యదర్శి నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులు వేగంగా జరిగేందుకు అవసరమైన కొన్ని కీలక సూచనలు చేశారు. ఈ ప్రాజెక్టుకు ఇప్పటివరకు ఎంత భూమిని ఇరిగేషన్ డిపార్టుమెంటు సేకరించింది.. ఇంకా ఎంత సేకరించాల్సి ఉన్నది.. ప్రస్తుతం ఆ ప్రక్రియ ప్రోగ్రెస్ ఏంటి.. ఇకపైన దృష్టి పెట్టాల్సిన అంశాలేంటి.. వీటి గురించి సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. ప్రాజెక్టుకు అవసరమైన భూమిని ఇచ్చిన నిర్వాసిత రైతులకు వెంట వెంటనే నష్టపరిహారాన్ని అందజేయాలని సీఎం (CM Revanth Reddy) స్పష్టం చేశారు. నిధుల విషయంలో ప్రభుత్వం నుంచి జాప్యం ఉండదన్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలతో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో ఆ సమావేశమైన సీఎం పలు అంశాలను లోతుగా సమీక్షించారు. ఈ జిల్లాలోని ఇతర ప్రాజెక్టులకు సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై జిల్లా మంత్రులు సంబంధిత జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి ప్రాజెక్టుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. ఈ భేటీలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్యేలు కసిరెడ్డి నారాయణరెడ్డి, మధుసూదన్ రెడ్డి, మేఘా రెడ్డి, రాకేశ్ రెడ్డి, వంశీకృష్ణ, వీర్లపల్లి శంకరయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పాల్గొన్నారు.
ప్రాజెక్టుల పెండింగ్ గత ప్రభుత్వ వైఫల్యం : మంత్రి జూపల్లి కృష్ణారావు
పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని గట్టు, కల్వకుర్తి, జూరాల, కోయిల్ సాగర్, భీమా అన్ని ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పక్షపాతం చూపిందన్నారు. ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుల గురించి మాట్లాడే నైతిక అర్హతే బీఆర్ఎస్ నేతలకు లేదన్నారు. గత ప్రభుత్వంలో 2015లో కేసీఆర్ పాలమూరు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, రెండేళ్లలో పూర్తి చేస్తామన్నారని గంభీర ప్రకటన చేశారని, మొత్తం అంచనా వ్యయం లక్ష కోట్లు అని చెప్పి పదేళ్లలో రూ.25 వేల కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారని గుర్తుచేశారు. కానీ 90% పూర్తి అయినట్లు ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్నరని ఆరోపించారు. పాలమూరు ప్రాజెక్టులపై గత ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందన్నారు. పాలమూరు ప్రాజెక్టు నీటి కేటాయింపులు సాధించలేకపోయారని, కృష్ణా నీటిని పదేళ్లు ఏపీకి తాకట్టు పెట్టారని ఆరోపించారు.
మాయమాటలతోనే బీఆర్ఎస్ కాలక్షేపం చేసింది : మంత్రి వాకిటి శ్రీహరి
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును అద్భుతంగా పూర్తిచేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పిందని, ఒక్క మోటారు పంపు సెట్‌ను బిగించి 90% పనులు పూర్తిచేశామని బీఆర్ఎస్ గొప్పలు చెప్పుకుంటున్నదని మంత్రి వాకిటి శ్రీహరి ఆరోపించారు. కేసీఆర్ మాయమాటలకు పాలమూరు ప్రజలు మోసపోరన్నారు. తొలుత 21 ప్యాకేజీలతో ప్రాజెక్టుకు రూపకల్పన చేసి జీవో ఇచ్చి చివరకు 18 ప్యాకేజీలతో సరిపెట్టారని ఆరోపించారు. ఇప్పటికైనా భ్రమల నుంచి ప్రతిపక్ష నేతలు బయటికు రావాలన్నారు. ఇప్పుడు ‘పోరు బాట’ రాగం ఎత్తుకున్నారని, నిజానికి పొర్లు దండాలు పెట్టినా జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు తీర్పు ఇచ్చినా ఆ పార్టీకి జ్ఞానోదయం కాలేదన్నారు.
Read Also: దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్!
Follow Us On: WhatsApp

