Mobile Popup Ad
Mobile Popup Ad

కరీంనగర్‌లో అక్రమ లేఅవుట్‌లపై మాజీ మేయర్ ఫైర్

కలం, కరీంనగర్ బ్యూరో : కరీంనగర్‌లో అక్రమ లేఅవుట్‌ల వ్యవహారం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మాజీ మేయర్‌, 58వ డివిజన్ కార్పొరేటర్ సర్దార్ రవీందర్ సింగ్ (Sardar Ravinder Singh) మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మున్సిపల్ కార్పొరేషన్, సుడా (SUDA) అధికారులపై తీవ్ర ఆరోపణలు చేశారు. నగరంలో విలీనమైన గ్రామాలలో కొత్తగా “నయా దందా” ప్రారంభమైందని, అనుమతులు లేకుండా భారీ స్థాయిలో అక్రమ లేఅవుట్‌‌లు  ఏర్పాటు చేసి ప్లాట్లు విక్రయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సర్వే నంబర్లు 52, 53, 85, 102, 115 సహా పలు ప్రాంతాలలో  ఇల్లీగల్ లేఅవుట్‌‌లు కొనసాగుతున్నాయని, దీనిపై నెల రోజుల క్రితమే అధికారులను అప్రమత్తం చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు.

చింతకుంట ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కూడా అక్రమంగా ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారని ఆరోపిస్తూ ఆధారాలు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. చట్టబద్ధమైన లేఅవుట్‌లలో పార్కులు, రోడ్లు, డ్రైనేజీ, పైప్‌లైన్లు వంటి మౌలిక సదుపాయాలకు 10 శాతం భూమి కేటాయించాల్సి ఉన్నప్పటికీ, అధికారులు నిబంధనలు పట్టించుకోవడం లేదని అన్నారు. “గేటెడ్ కమ్యూనిటీ” పేరుతో కొత్త రకం అక్రమాలకు తెరలేపారని, ప్రాథమిక సదుపాయాలు లేకుండానే లేఅవుట్‌లు మంజూరు చేస్తున్నారని విమర్శించారు. అల్గునూరు ప్రాంతంలో ప్రభుత్వ భూములు, సాగుభూములను కూడా ఓపెన్ ప్లాట్లుగా మార్చి అమ్ముతున్నారని ఆరోపించారు.

అక్రమ నిర్మాణాలు, డివియేషన్లపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని, భారీ మొత్తాలు తీసుకుని ఆక్యుపేషన్ సర్టిఫికెట్లు ఇస్తున్నారని పేర్కొన్నారు. మున్సిపల్ ఆదాయం పెంచాల్సిన అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ వ్యవహారంపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. నగరంలో ఒక్క ఇంచ్ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా ఊరుకోమని, అక్రమ లేఅవుట్‌లపై  బీఆర్ఎస్ పార్టీ తరఫున పోరాటం కొనసాగిస్తామని సర్దార్ రవీందర్ సింగ్ (Sardar Ravinder Singh) స్పష్టం చేశారు.

Read Also: దేశంలో ఆర్థిక తుఫాన్ రాబోతోంది.. మోదీ విధానాలపై రాహుల్ గాంధీ ఫైర్!

Follow Us On: WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>