కలం, నిర్మల్: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీఆర్ఎస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి రాంకిషన్ రెడ్డి (Rankishan Reddy) విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.
గురువారం నిర్మల్ (Nirmal) జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో రాం కిషన్ రెడ్డి ‘రైతు దీక్ష’ (Farmers Protest) చేపట్టారు. ఈ కార్యక్రమంలో రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంకిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించిందని ఆరోపించారు.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో వ్యవసాయ రంగం తీవ్రంగా నష్టపోయిందని అన్నారు. రైతులకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, పెండింగ్ లో ఉన్న రైతు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

