కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమంలో కీలకంగా వ్యవహరించిన రెండు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తూ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీఎంవో అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూపాలపల్లి జిల్లా గొర్లవీడు గ్రామానికి చెందిన మండల సమ్మిరెడ్డి కుమారుడు రాజు ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నాడు. 2013 జూన్ నెలలో ఉద్యమంలో భాగంగా అరెస్టయి చర్లపల్లి జైలుకు వెళ్లాడు.
ఆ తరువాత రాజు అదృశ్యమయ్యాడు. అతడి కోసం తల్లిదండ్రులు పలు చోట్ల వెతికినా లాభం లేకుండా పోయింది. వృద్ధాప్యంలోకి చేరుకున్న అతడి తల్లిదండ్రులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నట్లు ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సీఎంకు లేఖ రాశారు. స్పందించిన రేవంత్ రెడ్డి (Revanth Reddy).. ఆ కుటుంబానికి వెంటనే అమరవీరుల కోటాలో రూ.5 లక్షల సాయం అందించాలని ఆదేశించారు.
ఉచిత భోజనాలు అందిస్తూ..
హనుమకొండకు చెందిన లింగాల కేదారి, పుష్పలత దంపతులు తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. హోటల్ నడుపుకుంటూ.. అన్నం పరబ్రహ్మ స్వరూపమని, వృథా చేయకూడదని అవగాహన కల్పించేవారు. ఉద్యమ సమయంలో ఎవరూ తమ హోటల్‌కు వచ్చినా ఉచితంగా భోజనాలు, టీ, టిఫిన్లు అందిస్తూ.. తమ వంతు సేవలు అందించారు.
సెప్టెంబర్ 9న జరిగిన అగ్ని ప్రమాదంలో దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. సెప్టెంబర్ 9న కేదారి, చికిత్స పొందుతూ మరుసటి రోజు పుష్పలత మరణించారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి.. వెంటనే వారి కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేశారు. సంబంధిత చెక్కును అందించాలని హనుమకొండ కలెక్టర్‌కు ఆదేశాలు జారీ చేశారు.
Also Read : గోల్స్ వర్షం.. రికార్డు మ్యాచ్‌తో భారత్ జోరు!
Follow Us On: X(Twitter)

