epaper
Wednesday, February 18, 2026
epaper

ఏఐసీసీ చీఫ్ ఖర్గేతో సీఎం రేవంత్ భేటీ

కలం, తెలంగాణ బ్యూరో : ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గేతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించి పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చించారు. దావోస్ పర్యటన తర్వాత ఢిల్లీ వెళ్ళి హైకమాండ్ నేతలను కలవడం ఇదే ఫస్ట్ టైమ్. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న తరుణంలో ఢిల్లీ వెళ్ళడంతో ఆ అంశం గురించి కూడా ఖర్గేకు (Mallikarjun Kharge) వివరించినట్లు తెలిసింది. పార్టీ ప్రభుత్వం మధ్య సమన్వయం, కొన్ని ప్రధాన కార్పొరేషన్లకు నామినేటెడ్ పోస్టుల భర్తీ, సీనియర్లకు కల్పించాల్సిన అవకాశాలు… వీటిపై కూడా వివరించినట్లు సమాచారం. రాష్ట్రంలోని తాజాగా రాజకీయ పరిణామాలు, రాబోయే కాలంలో జరగనున్న ఎన్నికలు, ఏప్రిల్ నెలలో జరగాల్సిన రెండు రాజ్యసభ స్థానాల ఎన్నికలు… వీటి గురించి కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్లు తెలిసింది.

ప్రభుత్వ వ్యవహారాలపైనా చర్చలు :

సింగరేణికి చెందిన నైనీ బొగ్గు గనుల (Naini Coal Mines) టెండర్‌ను ఇటీవల రద్దు చేయడానికి దారితీసిన పరిస్థితులు, విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, గత ప్రభుత్వంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్‌పై సిట్ దర్యాప్తు తదితరాలను కూడా వివరించినట్లు తెలిసింది. రాష్ట్రంలో రెండేండ్ల పాలన పూర్తయిన తర్వాత తాజా స్థితిగతులపై వివరించి రానున్న రోజుల్లో చేపట్టబోయే కార్యక్రమాలపై కూడా కొంత వివరణ ఇచ్చినట్లు తెలిసింది. ఈ నెల చివర్లో లేదా వచ్చే నెల ఫస్ట్ వీక్‌లో జరిగే బడ్జెట్ సమావేశాలు, అందులో కొన్ని స్కీమ్‌లకు ఇవ్వనున్న ప్రాధాన్యత, నిధుల కేటాయింపు తదితరాలపైనా ప్రభుత్వ ఆలోచనను ఖర్గే దృష్టికి తీసుకెళ్ళినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం తాజా బడ్జెట్‌లో నిధులు ఇవ్వకపోయినా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న మెట్రో రైల్, మూసీ పునరుజ్జీవనం, సాగునీటి ప్రాజెక్టులు తదితరాలపై ఆలోచనను పంచుకున్నట్లు తెలిసింది.

రేపు కేంద్ర మంత్రులతో మీటింగ్ :

రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై పలువురు కేంద్ర మంత్రులతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) భేటీ కానున్నారు. తాజా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు కేటాయించకపోవడం, ప్రాజెక్టుల గురించి ప్రస్తావించకపోవడం, తద్వారా జరుగుతున్న అన్యాయం తదితరాలపై వారితో చర్చించనున్నారు. ప్రస్తుతానికి ఫిక్స్ అయిన షెడ్యూలు ప్రకారం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో ఎరువులు రసాయనాలు శాఖ మంత్రి జేపీ నడ్డాతో, జలవనరుల శాఖ మంత్రి సీఆర్ పాటిల్‌తో, ఆహార పంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషిలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు. ప్రస్తుతం పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నందున అక్కడికే వెళ్లి కలవనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలను రాతపూర్వకంగా వారికి తెలియజేసి నిధుల మంజూరుతో పాటు అనుమతులు ఇవ్వడంపై విజ్ఞప్తి చేయనున్నారు. కృష్ణా, గోదావరి జలాలపై ఆంధ్రప్రదేశ్‌తో జరుగుతున్న వివాదాన్ని కూడా జలశక్తి మంత్రితో చర్చించి తదుపరి కార్యాచరణపై విజ్ఞప్తి చేయనున్నారు.

Read Also: ఫోన్ ట్యాపింగ్ ఉచ్చు.. నాడు హెగ్డే.. నేడు కేసీఆర్

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>