కలం, తెలంగాణ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఎన్సీపీ ఎంపీ సుప్రియా సూలే కుమార్తె వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నారు. కేంద్ర మంత్రులు లేదా కాంగ్రెస్ హైకమాండ్ నేతలతో ప్రత్యేకంగా భేటీ అయ్యే షెడ్యూల్ లేదని, కేవలం వెడ్డింగ్ రిసెప్షన్ కార్యక్రమం కోసమే వెళ్తున్నారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. సుప్రియా సూలే కుమార్తె వివాహం జూన్ చివరి వారంలోనే జరగ్గా.. ఇప్పుడు ఢిల్లీలో రిసెప్షన్ జరుగుతున్నది. పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నందున అన్ని పార్టీల ఎంపీలు, పలువురు కేంద్ర మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.
వరుణ యాగం తర్వాత..!
రాష్ట్రంలోని ఎల్ నినో పరిస్థితులను గమనంలోకి తీసుకున్న ప్రభుత్వం నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లో వరుణయాగం నిర్వహిస్తున్నది. ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తున్న ఈ యాగం కోసం మూడు రోజులుగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. హిల్ కాలనీలోని విజయవిహార్‌లో యాగం ప్రారంభమైంది. నేడు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో బయలుదేరి హిల్‌కాలనీలోని బీసీ రెసిడెన్షియల్ స్కూల్‌కు సీఎం రేవంత్ రెడ్డి చేరుకుంటారు. విజయవిహార్‌లో జరిగే వరుణయాగంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొంటారు. యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన అర్చకులు, వేదపండితులు, 108 మంది రుత్వికులు, 11 హోమగుండాలతో ఈ యాగం నిర్వహిస్తున్నారు. కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాల్లో సమృద్ధిగా వర్షాలు కురవడమే ఈ యాగం ఉద్దేశం. యాగం ముగిసిన వెంటనే సీఎం రేవంత్ హైదరాబాద్ చేరుకుంటారు. ఆ తర్వాత ఢిల్లీకి బయలుదేరుతారు.

