Mobile Popup Ad
Mobile Popup Ad

నేడు ఢిల్లీకి సీఎం రేవంత్.. ప్రధానితో కీలక భేటీ

కలం, తెలంగాణ బ్యూరో : ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) బుధవారం సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరగనున్న నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో పాల్గొననున్నారు. ఈ సమావేశంలో చర్చించనున్న అంశాల ఎజెండాను అధికారికంగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. కానీ ఏయే అంశాలపై చర్చ జరగనున్నదీ రాష్ట్రాలకు పంపిన సర్క్యులర్‌లో ప్రస్తావించింది. ‘వికసిత్ భారత్-2047 – సమ్మిళిత మానవ అభివృద్ధి’ అనే థీమ్ ప్రకారం ఈ సమావేశంలో చర్చ జరగనున్నది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు గవర్నింగ్ కౌన్సిల్‌లో సభ్యులుగా ఉన్నందున తెలంగాణ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి హాజరవుతున్నారు.

విద్యారంగాన్ని బలోపేతం చేయడం, స్కిల్ డెవలప్‌మెంట్, ఉపాధి అవకాశాలను పెంపొందించడం, రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికలను జాతీయ లక్ష్యాలతో అనుసంధానించడం తదితరాలపై రాష్ట్రాల అభిప్రాయాలను కూడా ఈ సమావేశం తీసుకుని నిర్దిష్ట రోడ్ మ్యాప్‌ను రూపొందించనున్నది. వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, పెట్టుబడులు-పారిశ్రామికాభివృద్ధి, స్టార్టప్-యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం, పశ్చిమాసియా సంక్షోభంతో సౌర, పవన, ప్రత్యామ్నాయ ఇంధన వనరులను పెంచడం తదితరాలపైనా చర్చ జరిగే అవకాశమున్నది. వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలని, యూరియాపై ఆధారపడేకంటే సంప్రదాయ ఎరువులపై దృష్టి పెట్టాలని, భూసారం కోసం పంటల వైవిధ్యీకరణను ప్రోత్సహించాలని, రైతులకు మార్కెటింగ్ సౌకర్యాలను పెంచాలని.. ఇలాంటి అంశాలను కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశమున్నది.

దేశవ్యాప్తంగా జూలై 1 నుంచి గ్రామీణ ఉపాధి హామీ చట్టం స్థానంలో జీ-రామ్-జీ చట్టం అమల్లోకి వస్తున్నందున రాష్ట్రాల అభిప్రాయాలకు అనుగుణంగా చట్ట సవరణలు చేయాలని తెలంగాణ సీఎం ఈ సమావేశంలో ప్రస్తావించే అవకాశమున్నది. పాత చట్టం ప్రకారం కొనసాగుతున్న పనులు, వాటి బిల్లుల చెల్లింపులు.. ఇవన్నీ పూర్తయ్యేంత వరకు కొత్త చట్టం అమలును వాయిదా వేయడంతో పాటు పాత చట్టం ప్రకారమే కేంద్రం నిధులను విడుదల చేయాలని ప్రతిపాదించే అవకాశమున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మెట్రో రైల్ విస్తరణ, మూసీ పునరుజ్జీవం, రీజినల్ రింగ్ రోడ్డు తదితరాలను ప్రస్తావించి కేంద్రం నుంచి అనుమతులు, నిధులు ఇవ్వాల్సిందిగా కోరే అవకాశమున్నది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>