ఒడిశా టు నల్గొండ గంజాయి సరఫరా.. అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్!

కలం, నల్లగొండ: ఒడిశా కేంద్రంగా గంజాయి, వీడ్ ఆయిల్ స్మగ్లింగ్ (Ganja Smuggling) చేస్తూ యువతకు విక్రయిస్తున్న 8 మంది సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను నల్గొండ (Nalgonda) వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 10 లక్షల విలువైన మత్తు పదార్థాలు, వాహనాలు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా పోలీసు యంత్రాంగం శనివారం వెల్లడించింది. నల్గొండ పట్టణంలోని మునుగోడు బైపాస్ రోడ్డులో ఉన్న ఖాళీ స్థలంలో కొంతమంది యువకులు గంజాయిని విక్రయిస్తూ, సేవిస్తున్నారనే విశ్వసనీయ సమాచారంతో నల్గొండ వన్ టౌన్ పోలీసులు మెరుపు దాడి చేశారు.

పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించిన 8 మంది నిందితులతో పాటు ఒక మైనర్‌ను చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి గంజాయి 5.6 కిలోలు, వీడ్ (హాష్) ఆయిల్ 100 ఎంఎల్, 5 బైక్‌లు (ఖమ్మం, నకిరేకల్, హైదరాబాద్‌లలో దొంగిలించినవి), 4 మొబైల్ ఫోన్లు, ఒక డమ్మీ తుపాకీ, ఒక బటన్ చాకును స్వాధీనం చేసుకున్నారు.

అరెస్టయిన వారిలో కస్పరాజు నాగరాజు (A-1), గంటెకంపు మధు (A-2), చెన్నపాక సుశాంక్ (A-3), పెండ్ర వాసు (A-4), సయ్యద్ షోయబ్ (A-7), గంధం శివమణి (A-8), చెరుకు దీపక్ (A-9), నకిరేకంటి ధరణి కుమార్ (A-10) ఉన్నారు. వీరితో పాటు ఒక మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకోగా, ఒడిశాకు చెందిన ప్రధాన సరఫరాదారు మనుకర్ (A-5), మహబూబాబాద్‌కు చెందిన హరి (A-6), నల్గొండకు చెందిన ఉదయ్ (A-11), జున్ను (A-12) పరారీలో ఉన్నారు.

కాగా, ముఠాలోని ప్రధాన నిందితులు గతంలో పలు నేరాల్లో భాగస్వాములుగా ఉండి, మత్తు పదార్థాలకు బానిసలయ్యారు. త్వరగా డబ్బు సంపాదించేందుకు దొంగిలించిన బైక్‌లను ఒడిశా తీసుకెళ్లి సరఫరాదారు మనుకర్‌కు ఇచ్చి, అక్కడ నుంచి గంజాయి, వీడ్ ఆయిల్ కొనుగోలు చేశారు. ఆ పదార్థాలను చిన్న ప్యాకెట్లుగా మార్చి నల్గొండలోని విద్యార్థులు, యువతకు అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది.

తమ వ్యాపారాన్ని అడ్డుకునే వారిని భయపెట్టేందుకు డమ్మీ తుపాకీ, బటన్ చాకును వినియోగిస్తున్నట్లు నిందితులు అంగీకరించారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన డీఎస్పీ కె. శివరాం రెడ్డి, వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏమిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఎస్ఐలు ముత్తయ్య, సంపత్, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>