కలం, వెబ్ డెస్క్ : మంచాల మండలం ఆరుట్ల గ్రామంలో విద్యా రంగానికి సంబంధించిన ఒక సరికొత్త అధ్యాయం మొదలైంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఆరుట్ల గ్రామంలో నూతనంగా నిర్మించిన తెలంగాణ పబ్లిక్ స్కూల్ (Telangana Public School) ను అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిలాఫలకాన్ని ఆయన ఆవిష్కరించారు.
ఉచిత విద్య, డిజిటల్ వసతులు
ఈ తెలంగాణ పబ్లిక్ స్కూల్ లో నర్సరీ క్లాస్ నుండి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు పూర్తి ఉచితంగా విద్యాబోధన అందించనున్నారు. కార్పొరేట్ పాఠశాలలకు ఏమాత్రం తీసిపోని విధంగా అంతర్జాతీయ ప్రమాణాలతో డిజిటల్ క్లాస్‌రూమ్స్, అత్యాధునిక సైన్స్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్, విశాలమైన క్రీడా వసతులను ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు. పేద, మధ్యతరగతి పిల్లలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్యను అందించడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం.
విద్యార్థులకు అల్పాహార పథకం ప్రారంభం
పాఠశాల ప్రారంభోత్సవంతో పాటు విద్యార్థుల ఆరోగ్యం, పోషకాహారాన్ని దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ అల్పాహార పథకాన్ని (Breakfast Scheme) కూడా లాంఛనంగా ప్రారంభించారు. స్వయంగా విద్యార్థులకు అల్పాహారాన్ని వడ్డించిన ముఖ్యమంత్రి, వారితో కలిసి కాసేపు ముచ్చటించి చదువుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయాన్నే బడికి వచ్చే పిల్లలకు ఈ పోషకాలతో కూడిన అల్పాహారం ఎంతో మేలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

