కలం , కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పర్యటన మొదలైంది. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్‌లో జిల్లాకు చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి ముందుగా కరీంనగర్ నూతన కలెక్టరేట్ (New Karimnagar Collectorate) భవన సముదాయాన్ని ప్రారంభించారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస రెడ్డి, పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ బండి సంజయ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూజా కార్యక్రమాల అనంతరం కార్యాలయాన్ని ప్రారంభించి, తర్వాత కలెక్టర్ చిత్రా మిశ్రాను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించారు. పలు అభివృద్ధి పనులకు కూడా శంకుస్థాపనలు చేశారు.
సీఎం హోదాలో రేవంత్ రెడ్డి తొలిసారిగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్లలో మరికొద్ది సేపట్లో పర్యటించనున్నారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు సుమారు 4 కిలోమీటర్ల మేర భారీ రోడ్‌షో నిర్వహించి బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఈ పర్యటనలో భాగంగా సిరిసిల్లలో రూ.345.78 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో కరీంనగర్‌లో 550 మంది, సిరిసిల్లలో 1,600 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతను కట్టుదిట్టం చేశారు.

