కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు పర్యటించారు. ఫ్యూచర్ సిటీ డెవలప్‌మెంట్ అథారిటీ (FCDA) భవనాన్ని సీఎం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులతో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్‌ను తలదన్నేలా భారత్ ఫ్యూచర్ సిటీ నిర్మాణం జరుగుతుందని సీఎం వెల్లడించారు. తన డ్రీమ్ ప్రాజెక్ట్ భావి తరానికి బంగారు బాటగా మారుతుందని హామీ ఇచ్చారు. హైదరాబాద్ నగరానికి ఎంతో గొప్ప చరిత్ర ఉందని, నిజాంలు, కులీ కుతుబ్ షాహీలు నగరాన్ని అద్భుతంగా విస్తరించారని, అందుకే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలుగా రాణిస్తున్నాయని అన్నారు. హైదరాబాద్‌కు 400 ఏళ్ల చరిత్ర ఉందని, సికింద్రాబాద్‌కు 200 ఏళ్ల చరిత్ర ఉందని సీఎం గుర్తు చేశారు.
ఇక సైబరాబాద్ ఒక సాంకేతిక విప్లవం అని, రాష్ట్ర ఆదాయంలో 60 శాతం ఆదాయాన్ని అందించి తెలంగాణ ముఖ చిత్రాన్నే మార్చేసిందని చెప్పారు. సైబరాబాద్ ప్రాంతంలో ఎకరాకు రూ.200 కోట్లకు పైగా భూముల విలువ ఉందంటే బంగారం కంటే ఎక్కువ విలువ రంగారెడ్డి భూములకే ఉందని సీఎం వ్యాఖ్యానించారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ప్రాంతంలో ఆర్మీ నివసించడానికి, ఆర్మీ ఆయుధాలు దాచుకోవడం వల్లనే జంట నగరాలు శత్రు దుర్భేధ్యంగా మారాయన్నారు.
స్వతంత్రం వచ్చిన తర్వాత నాటి ముఖ్యమంత్రులు సైబరాబాద్ నగరాన్ని గొప్ప నగరంగా నిర్మించి ప్రపంచానికి అందించారన్నారు. నాడు సైతం హైటెక్ సిటీని వద్దన్న వారు, ఓఆర్ఆర్ను అడ్డుకున్న వారు ఉన్నారన్నారు. నాటి సీఎంలు మూసీ కంటే ఎక్కువ విషాన్ని కడుపులో పెట్టుకొని ఇక్కడి ప్రజలు, నగరం అభివృద్ధి చెందవద్దని విషం చిమ్మారన్నారు. నాటి సీఎంలు ఓఆర్ఆర్, హైటెక్ సిటీ, ఐటీ కంపెనీలు, ఎయిర్ పోర్ట్, గూగూల్, ఇన్ఫోసిస్ వంటి సంస్థలు తీసుకురాకుండా ఉండి ఉంటే నేడు పది లక్షల మంది తెలంగాణ యువత ప్రపంచం నలుమూలలా ఐటీ నిపుణులుగా రాణించే వారా? అని ప్రశ్నించారు.
ఫ్యూచర్ సిటీని (Future City) అడ్డుకునేందుకు కొందరు రాక్షసులు ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) ఆరోపించారు. ఇది ప్రస్తుత యువత భవిష్యత్‌తో పాటు, రానున్న తరాలకు, ప్రపంచానికే గొప్ప నగరంగా రూపుదిద్దుకుంటుందని చెప్పారు. ప్రజా ప్రభుత్వం తీసుకున్న గొప్ప సంకల్పాన్ని అడ్డుకునేందుకు కొందరు కుట్రలు చేస్తున్నారని చెప్పారు. అధికారంలోకి రాగానే ప్యూచర్ సిటీని అడ్డుకుంటామని కొందరు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఫ్యూచర్ సిటీని అడ్డుకుంటే వారికి రానున్న ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాదని పేర్కొన్నారు. రానున్న ఎనిమిదేళ్లలో ఫ్యూచర్ సిటీని పూర్తి చేసుకుందామని సీఎం పిలుపునిచ్చారు. 2034 నాటికి భారత్ ఫ్యూచర్ సిటీ వన్ ట్రిలియన్ డాలర్ ఎకానమీకి వేదిక కావాలన్నారు. ఈ సిటీ రానున్న రోజుల్లో టోక్యో, న్యూయార్క్, సింగపూర్ వంటి నగరాలతో పోటీ పడే నగరంగా రూపొందాలని అధికారులను ఆదేశించినట్లు సీఎం రేవంత్ తెలిపారు.
Read Also: కేసీఆర్‌పై పూలు చల్లి బతుకమ్మ కుంట కబ్జా: సీఎం రేవంత్
Follow Us On : WhatsApp

