కలం, వెబ్ డెస్క్ : కరీంనగర్ జిల్లా చొప్పదండిలో నిర్వహించిన ‘ప్రజా పాలన- ప్రగతి బాట’ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య ఫెవికాల్ బంధం ఉందని, ఆ రెండు పార్టీలు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ తన అవయవ దానం చేసి మరీ బీజేపీని ఎనిమిది స్థానాల్లో గెలిపించిందని, వీరిద్దరి మధ్య చీకటి ఒప్పందం ఉందని అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణ జరపాలని అసెంబ్లీ సాక్షిగా తీర్మానం చేసి కేంద్రానికి పంపినా, ఆరు నెలలైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. ప్రధాని మోడీ గతంలో కాళేశ్వరం కేసీఆర్‌కు ఏటీఎంగా మారిందని విమర్శించినా, విచారణ విషయంలో మాత్రం మౌనంగా ఉండటం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పాటు సోనియా గాంధీ ఇచ్చిన మాట వల్లే సాధ్యమైందని, ఎన్ని అవాంతరాలు ఎదురైనా ఆమె రాష్ట్రాన్ని ఇచ్చారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బండి సంజయ్ వంటి వారు ఢిల్లీ నుంచి నిధులు తీసుకురావడంలో విఫలమయ్యారని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తామన్న హామీ ఏమైందని, మెట్రో రెండో విడత లేదా మూసీ ప్రక్షాళన నిధుల గురించి బీజేపీ జాతీయ నాయకులు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. బండి సంజయ్ కేవలం రంకెలు వేయడం మానేసి, కాళేశ్వరంపై విచారణ జరిపించి కేసీఆర్‌ను జైలుకు పంపేలా చూడాలని సవాల్ విసిరారు. వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవకుండా కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటారని ఆయన తెలిపారు.
2027 గోదావరి పుష్కరాల నాటికి బాసర నుంచి భద్రాచలం వరకు ఉన్న ఆలయాలను అభివృద్ధి చేస్తామన్నారు. కరీంనగర్‌కు ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని, వరంగల్, కరీంనగర్ పట్టణాలను జంట నగరాలుగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ఎన్ని శాపనార్థాలు పెట్టినా మరో ఎనిమిదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటుందని, తెలంగాణను దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా మారుస్తామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలిపారు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి కోసం మళ్లీ వస్తానని, మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరాలని పిలుపునిచ్చారు.
Read Also: 17 ఏళ్లుగా ఏం చేశారు..? కేటీఆర్‌ను నిలదీసిన సిరిసిల్ల ప్రజలు
Follow Us On: Sharechat


