కలం, నిర్మల్ : దేశ రాజధాని ఢిల్లీ యూనివర్సిటీలో ప్రతిష్టాత్మకంగా జరిగిన విద్యార్థి సంఘ ఎన్నికల్లో ఏబీవీపీ ఘన విజయం సాధించడంపై బీజేపీ రాష్ట్ర నాయకులు రావుల రామనాథ్ (Ravula Ramanath) హర్షం వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో అధ్యక్ష, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి స్థానాలను ఏబీవీపీ భారీ మెజార్టీతో గెలుచుకోవడం జాతీయవాదుల విజయానికి నిదర్శనమని అన్నారు. కాంగ్రెస్ అనుబంధ విద్యార్థి సంఘం ఎన్‌ఎస్‌యూఐ పేరుతో ఎన్నికల బరిలోకి దిగిన కమ్యూనిస్టులు, సమాజ్‌వాదీ పార్టీ, మమతా బెనర్జీ, ఆమ్‌ఆద్మీ పార్టీ తదితర శక్తులు ఏకమై పోటీ చేసినప్పటికీ ఒక్క స్థానాన్ని కూడా గెలుచుకోలేకపోయాయని పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా విద్యార్థులు వాటిని తిరస్కరించి ఏబీవీపీకి పట్టం కట్టారని అన్నారు.
ఇటీవల ఢిల్లీ కేంద్రంగా విద్యార్థులను రెచ్చగొట్టి, దేశంలోని జెన్‌జీ మొత్తం ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ఉందనే ప్రచారం చేశారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల పేరుతో ఉద్యమాలు నిర్వహిస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయాలని చూసిన వారికి ఢిల్లీ యూనివర్సిటీ విద్యార్థులు తమ ఓటుతో సమాధానం చెప్పారని పేర్కొన్నారు. దేశంలో జాతీయవాదులు, దేశభక్తులకు తిరుగులేదనే విషయాన్ని డీయూ విద్యార్థి సంఘ ఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయని అన్నారు.

