వైభవ్‌కు ఇంకా అంత టెక్నిక్ లేదు: పనేసర్

కలం, స్పోర్ట్స్: భారత యువ బ్యాటర్ వైభవ్ సూర్యవంశీ టెస్ట్ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. టీ20ల్లో దూకుడుగా ఆడుతున్న వైభవ్‌కు టెస్ట్ క్రికెట్‌కు అవసరమైన టెక్నిక్ ఇంకా లేదని మాజీ ఇంగ్లండ్ స్పిన్నర్ మాంటీ పనేసర్ (Monty Panesar) అభిప్రాయపడ్డారు. వైభవ్ టీ20ల్లో ఇప్పటికే తన సత్తా చాటాడు. ఇంగ్లండ్ సిరీస్‌లో 14, 13, 15 పరుగులతో పెద్దగా ఆకట్టుకోలేదు. ఆ తర్వాత జింబాబ్వే సిరీస్‌లో మాత్రం అదరగొట్టాడు. మూడు మ్యాచ్‌ల్లో 151 పరుగులు చేశాడు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. దీంతో ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నాడు.

అయితే టెస్ట్ క్రికెట్ విషయంలో పనేసర్‌కు భిన్నమైన అభిప్రాయం ఉంది. ప్రస్తుత టెక్నిక్‌తో వైభవ్ టెస్ట్ క్రికెట్‌కు మారడం కష్టమని ఆయన పేర్కొన్నారు. కానీ మాజీ ఆస్ట్రేలియా కెప్టెన్ మైఖేల్ క్లార్క్ మాత్రం వైభవ్‌కు మద్దతుగా మాట్లాడారు. మూడు ఫార్మాట్లలోనూ రాణించడం సాధ్యమేనని చెప్పారు. విరాట్ కోహ్లీ, ఏబీ డివిలియర్స్ ఇందుకు ఉదాహరణలని పేర్కొన్నారు. వైభవ్ కూడా సరైన మార్పులతో టెస్ట్ క్రికెట్‌లో రాణించగలడని క్లార్క్ అభిప్రాయపడ్డారు.

అయితే టెస్ట్ క్రికెట్ ఆడాలన్న ఆసక్తి వైభవ్‌కు ఉందా అనేది కూడా కీలకమని చెప్పారు. ఇక రెడ్ బాల్ క్రికెట్‌లోనూ వైభవ్ ఇప్పటికే తన సత్తా చూపించాడు. దులీప్ ట్రోఫీ సెమీఫైనల్లో ఈస్ట్ జోన్ తరఫున ఆడిన అతడు 15 ఏళ్ల 157 రోజుల వయసులో హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో దులీప్ ట్రోఫీలో అత్యంత చిన్న వయసులో ఈ ఘనత సాధించిన ఆటగాడిగా నిలిచాడు. అదే మ్యాచ్‌లో సెంచరీకి వైభవ్ చేరువయ్యాడు. కానీ 92 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో వైభవ్ టెస్ట్ క్రికెట్ భవిష్యత్తుపై మాజీ ఆటగాళ్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>