కలం, వెబ్ డెస్క్: కేరళ సీఎంగా ఎంపికైన వీడీ సతీశన్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth) శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. కేరళ ప్రజలకు దశాబ్దాలుగా సేవ చేస్తూ విలువలతో కూడిన రాజకీయాలు చేసే సతీశన్‌కు ముఖ్యమంత్రి పదవి రావడం సముచిత గుర్తింపు అని సీఎం రేవంత్ తెలిపారు. ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం, సమగ్రాభివృద్ధికి మద్దతుగా విస్తృతంగా ప్రచారం చేసిన కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్‌కు ప్రజలు అధికార బాధ్యతలు అప్పగించారని చెప్పారు. విద్య, వైద్యం, అక్షరాస్యతలో కేరళ దేశానికి ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. సతీశన్ నాయకత్వంలో కేరళ మరింత అభివృద్ధి సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కేరళ మరింత ప్రగతి, సుసంపన్నత దిశగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు. పెట్టుబడులు, నైపుణ్యాభివృద్ధి, పర్యాటకం, పరస్పర సహకారం వంటి రంగాల్లో కేరళ ప్రభుత్వంతో కలిసి పనిచేయడానికి తమ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ఇటీవల జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అఖండ విజయం సాధించింది. పదేళ్ల సుదీర్ఘ కాలం తరువాత తిరిగి అధికార పీఠాన్ని కైవసం చేసుకుంది. సీపీఎం నేతృత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (LDF)కు తీవ్ర వ్యతిరేకతతో యూడీఎఫ్ (UDF)కు ప్రజలు స్పష్టమైన తీర్పును ఇస్తూ అధికారాన్ని కట్టబెట్టారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎల్డీఫ్ కు చారిత్రక ఓటమిని మిగిల్చాయి. కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ సారథ్యంలోని యూడీఎఫ్ కూటమి అపూర్వ విజయాన్ని నమోదు చేసింది. మొత్తం 140 స్థానాల్లో ఇప్పటికే 102 సీట్లు గెలుచుకొని ఘన విజయం సాధించింది. యూడీఎఫ్ కూటమిలో భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (IUML), కేరళ కాంగ్రెస్ (జోసెఫ్), కేరళ కాంగ్రెస్ (జాకబ్), రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ (RSP), ఇతర చిన్న పార్టీలు ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు శశి థరూర్, కేసీ వేణుగోపాల్, రమేష్ చెన్నితాల కీలక పాత్ర పోషించారు. తాజాగా వీడీ సతీషన్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎంపికయ్యారు.

