మూసీ నిర్వాసితులకు సీఎం రేవంత్ కీలక హామీ

కలం, వెబ్ డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ సుందరీకరణ (Musi River Beautification) ప్రాజెక్టుపై శాసన మండలిలో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక వ్యాఖ్యలు చేశారు. మూసీ పరివాహక ప్రజలను నిరాశ్రయులను చేయడం తమకు ఇష్టం లేదని.. నిర్వాసిత ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మూసీ పరిధిలో ఉన్న అందరికీ పునరావాసం కల్పిస్తామని ప్రకటించారు. మెరుగైన జీవన విధానానికి కావాల్సిన ప్రమాణాలు కల్పిస్తామని.. విద్య, వైద్య సదుపాయాలు కల్పిస్తూ వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. మూసీ పరివాహకంలో ఉన్న అందరికీ న్యాయం చేస్తామని సభావేదికగా హామీ ఇచ్చారు. రెచ్చగొట్టే వారి ఉచ్చులో పడవద్దని మూసీ ప్రాంత ప్రజలకు సీఎం విజ్ఞప్తి చేశారు. మూసీ రీవర్ డెవలమెంట్ కార్పొరేషన్ ప్రారంభించింది తామే అని సిరిసిల్ల ఎమ్మెల్యే చెప్పాడని సీఎం అన్నారు. ప్రారంభించి మీరు వదిలేస్తే.. తాము ఆ ప్రాజెక్టును ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. డ్రైనేజ్‌ వ్యవస్థను మారిస్తే మూసీ సుందరీకరణ త్వరగా పూర్తవుతుందని అన్నారు. సబర్మతి, యమున, గంగాను ప్రక్షాళన చేస్తామని అక్కడి సీఎంలు చెబుతున్నారని.. మన రాష్ట్రంలో మూసీ ప్రక్షాళన చేసుకోవద్దా? అని ప్రశ్నించారు.

30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ..

హైదరాబాద్‌ చారిత్రక నగరమని.. అనేక గొప్ప కట్టడాలు ఉన్నాయని సీఎం అన్నారు. కేంద్రమంత్రిగా జైపాల్‌రెడ్డి ఉన్నప్పుడు రాష్ట్రానికి నిధులు వచ్చేలా చూశారని గుర్తు చేశారు. హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ బాగా పెరిగిందన్నారు. రాష్ట్రాన్ని మూడు ప్రాంతాలుగా విభజించి అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఓఆర్‌ఆర్‌ బయటకు తరలిస్తామని సీఎం వ్యాఖ్యానించారు. రోడ్లను అండర్‌పాస్‌లు, సర్ఫేస్‌, ఎలివేటెడ్ కారిడార్లుగా విభజించామని చెప్పారు. మెట్రో విస్తరణకు ఎల్‌ అండ్ టీ ముందుకు రాలేదని.. కేంద్రప్రభుత్వ నిబంధన వల్ల రూ.15 వేల కోట్లు కేటాయించి మెట్రోను స్వాధీనం చేసుకున్నామన్నారు. 30 వేల ఎకరాల్లో ఫ్యూచర్ సిటీ నిర్మిస్తున్నామని చెప్పారు.

మెట్రోను మరో 76 కిలోమీటర్లు విస్తరిస్తాం..

నగరంలో మెట్రోను మరో 76 కిలోమీటర్లు విస్తరిస్తామని హామీ ఇచ్చారు. నగర శివార్ల నుంచి వచ్చే ఉద్యోగుల సంఖ్య బాగా పెరిగిందని.. మెట్రో విస్తరణపై కేంద్రం కూడా సానుకూలంగా స్పందించిందని చెప్పారు. శామీర్‌పేట, మేడ్చల్ వైపు ఎలివేటెడ్ కారిడార్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. ఎలివేటెడ్ కారిడార్ల కోసం కేంద్ర సంస్థలతో మాట్లాడి భూమి తీసుకుంటున్నామన్నారు. పైన విమానాలు ఎగిరితే.. కింద అండర్ టన్నెల్‌ వస్తోందని చెప్పారు. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌ రోడ్ల విస్తరణకు ఇబ్బందులు ఉన్నాయని సీఎం చెప్పారు. సిగ్నల్స్‌ వైపు ఆగకుండా వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. రద్దీ ప్రాంతాల్లో ఫుట్‌పాత్‌ ఆక్రమణలు తొలగిస్తున్నామన్నారు. చిరువ్యాపారులకు ఇతరచోట్ల స్థలం కేటాయిస్తామని చెప్పారు. పలుచోట్ల మల్టీ లెవల్ కారు పార్కింగ్‌ ఏర్పాటు చేస్తున్నామని.. హిల్ట్ పాలసీ కింద పరిశ్రమలకు వినియోగ మార్పిడి చేస్తున్నామని అన్నారు. దూరం తగ్గించేందుకు ఎలివేటెడ్‌ కారిడార్లు వేస్తున్నామని చెప్పారు. సిటీ మధ్య నుంచి అన్ని ప్రాంతాలకు ఎలివేటెడ్‌ కారిడార్లు వస్తాయన్నారు. ఎలివేటెడ్‌ కారిడార్ల వల్ల హైదరాబాద్‌ అద్భుత నగరంగా మారుతుందని ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>