కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో ఆక్వా రంగ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఆక్వా ఉత్పత్తుల నాణ్యతను మరింత పెంచి, ప్రపంచ మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. దేశంలో ఉత్పత్తి అవుతున్న రొయ్యలలో దాదాపు 66 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తున్నాయని సీఎం వెల్లడించారు. రాష్ట్రం ఆక్వా రంగంలో అగ్రస్థానంలో ఉండటమే కాకుండా, వేలాది మంది రైతులు, మత్స్యకార కుటుంబాలకు జీవనాధారంగా నిలుస్తోందని అన్నారు.
సముద్ర ఉత్పత్తుల ఎగుమతులను గణనీయంగా పెంచడంపై ప్రభుత్వం దృష్టి సారించిందని చంద్రబాబు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సముద్ర ఉత్పత్తుల రంగంలో భారత్ రెండో స్థానంలో ఉందని, ఎగుమతుల పరంగా గత ఏడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో పురోగతి సాధించామని వివరించారు. అయితే ఆక్వా ఉత్పత్తుల రంగంలో ఇంకా మరింత ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం చైనా, నార్వే, ఈక్వెడార్, వియత్నాం, చిలీ వంటి దేశాలు ఆక్వా ఉత్పత్తుల ఎగుమతులలో ముందంజలో ఉన్నాయని పేర్కొన్నారు. ఆ దేశాలకు పోటీగా నిలిచేలా ఆధునిక సాంకేతికత, నాణ్యత నియంత్రణ, ప్రాసెసింగ్ సదుపాయాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు.

