కలం, వెబ్ డెస్క్: కేంద్రం సుపరిపాలన చేస్తే దానిని అందిపుచ్చుకోకుండా వైసీపీ నేతలు రాష్టాన్ని నిర్వీర్యం చేశారని సీఎం చంద్రబాబు (CM Chandrababu) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కూటమి పాలనకు రెండేళ్ల సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన బహిరంగ సభలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు. వైసీపీ హయాంలో కేంద్ర పథకాలను పక్కన పెట్టేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టును పాడుచేశారని అన్నారు. రాష్ట్రానికి ఇన్వెస్టర్స్ వస్తుంటే.. వెంటాడి వేధించి తరిమికొట్టారని ఫైర్ అయ్యారు. రాష్ట్ర యువత భవిష్యత్తుపైన దెబ్బ కొట్టారని విమర్శించారు. ఆరోజు కేంద్రం ఇంటింటికి నల్లా నీరు ఇవ్వాలని రూ.27,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్టు శాంక్షన్ చేస్తే 40 శాతం గ్రాంట్ ఇస్తే దానిని కూడా ఉపయోగించుకోలేదని ఫైర్ అయ్యారు. దీంతో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రావలసిన అన్ని పథకాలను నిలిపివేసిందని అన్నారు. అలాంటి చీకటి పాలను వైసీపీ చేసిందని దుయ్యబట్టారు.
ఎక్కడికక్కడ కేసులు పెట్టారు..
దుర్మార్గపు పాలనపై ఆరోజు విడివిడిగా మూడు పార్టీలు పోరాడితే ఎక్కడికక్కడ కేసులు పెట్టారని గుర్తు చేశారు. అరాచక చీకటి పాలనను చీల్చుకొని ప్రజలపాలన తెచుకున్నామని అన్నారు. ఇంత రాజకీయ అనుభవం ఉన్న తనను ఒక్క నోటీసు ఇవ్వకుండా 53 రోజులు జైల్లో పెట్టారని గుర్తు చేశారు. పవన్ కల్యాణ్ (Pawan Kalyan)ను సైతం అడుగడుగునా హేళన చేశారని అన్నారు. ఎన్నికల్లో విజయం చూసి పొంగిపోలేదని.. రాష్ట్ర దుస్థితి చూసి కుంగిపోలేదని చెప్పారు. నాలుగవసారి ముఖ్యమంత్రిగా గెలుపొందానని.. విజన్ తో పనిచేస్తానని తెలిపారు. హైదరాబాద్ ను అభివృద్ధి చేయడంలో, తెలుగు జాతిని ప్రపంచ పటంలో పెట్టడంలో అలుపెరుగని పోరాటం చేశానని తెలిపారు.
వ్యవస్థలను వైసీపీ నాశనం చేసింది..
రాష్ట్రంలో నాలుగవ సారి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్ర పరిస్థితి చూస్తే ఎక్కడ చూసినా అఘాయిత్యాలే ఉన్నాయని.. వ్యవస్థలను వైసీపీ నాశనం చేసిందని సీఎం మండిపడ్డారు. రాష్ట్రానికి నిధులు లేవు.. డిపార్ట్ మెంట్స్ అన్నీ విధ్వంసం అయ్యాయని చెప్పారు. ఆరోజు ఒక నిర్ణయం చేసి ఏడు తెల్లకాగితాలను ప్రజల ముందు పెట్టానని గుర్తు చేశారు. రెండేండ్లు గడిచిన సందర్భంగా ఈరోజు కూడా అన్ని విషయాలను ప్రస్తావిస్తూ తెల్లకాగితాలను విడుదల చేస్తానని తెలిపారు. దేశం దూసుకెళ్తుంటే.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం విధ్వంసానికి గురైందని.. దీనిని గుర్తించే ప్రజలు విజ్ఞత చూపించి తమను గెలిపించారని అన్నారు. రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడి సమైక్యంగా పనిచేసి గెలుపొందాయని అన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజలు శాంతియుతంగా ఉండగలుగుతున్నారంటే.. శాంతి, భద్రతలు కాపాడుతున్నామంటే, ప్రజల ఆస్తులకు రక్షణ ఉందంటే అది ఎన్డీయేతోనే సాధ్యం అయిందని చెప్పారు. ఈరోజు విధ్వంసమైన వ్యవస్థలను మళ్ళీ గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.
అప్పులు చేసేవారికి ఆ అర్హత లేదు..
రెండేళ్లల్లో చేపట్టిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన వంటి అంశాలపై సభలో సీఎం వివరించారు. ప్రజలకు న్యాయం చేయాలన్నదే జనసేన, టీడీపీ, బీజేపీ పార్టీల లక్ష్యమని అన్నారు. విశాఖకు, గూగుల్, కాగ్నిజెంట్, టీసీఎస్ వంటి ఐటీ కంపెనీలు వస్తే, అమరావతికి క్వాంటం వ్యాలీ వస్తోందని చెప్పారు. ఏపీకి పరిశ్రమలు రావాలని… తమ రాష్ట్రం పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. రాష్ట్ర యువతకు ఉద్యోగాలు రావాలని.. అందుకే పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాలను కూడా యువతకు కల్పిస్తున్నామని చెప్పారు. అభివృద్ధి చేసి ఆదాయం పెంచిన వారికే సంక్షేమం పంచే అధికారం ఉందని చెప్పారు. అప్పులు చేసే వ్యక్తికి.. తాకట్టు పెట్టే వారికి సంక్షేమం గురించి మాట్లాడే అర్హత లేదని వైసీపీపై ఫైర్ అయ్యారు.

