కలం, వెబ్ డెస్క్: నిండుకుండలా కళకళలాడుతున్న బ్యారేజీలను చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) అన్నారు. విజయవాడలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొని తిరిగి ఇంటికి వెళ్తున్న క్రమంలో ముఖ్యమంత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద కాసేపు ఆగారు. ‘బ్యారేజీ వద్ద గోదావరి పరవళ్లను పరిశీలించి, పులకించిపోయారు. పట్టిసీమ ప్రాజెక్ట్ ద్వారా ఈ సీజన్లో ఇప్పటివరకు 17.52 టీఎంసీల గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు విజయవంతంగా తరలించాం. డెల్టాలోని తూర్పు, పశ్చిమ ప్రధాన కాలువలు, గుంటూరు ఛానల్ ద్వారా మొత్తం 7,158 క్యూసెక్కుల నీటిని పంటల సాగు కోసం విడుదల చేస్తున్నాం. ఎల్ నినో ప్రభావంతో తలెత్తిన వర్షాభావ పరిస్థితులను సమర్థవంతమైన నీటి నిర్వహణతో ఎదుర్కొంటూ, మన రైతన్నలకు సాగునీటి ఇబ్బందులు రాకుండా అన్ని చర్యలూ తీసుకుంటున్నాం’ అని తన ‘ఎక్స్’ ఖాతాలో పోస్ట్ చేశారు.
కాగా, పట్టిసీమ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ సీజన్ లో ఇప్పటి వరకు 17.52 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా నదికి తరలించినట్లు నీటిపారుదల శాఖ అధికారులు సీఎంకు వివరించారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కారణంగా గోదావరి నది నుంచి ఇప్పటి వరకు 521 టీఎంసీల నీరు సముద్రంలో కలిసిందని తెలిపారు.

