కలం, భువనగిరి: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జల ఉద్యమం చేస్తామని చెబుతున్నారు.. అయితే తెలంగాణ ప్రజలు ఇప్పటికే బీఆర్‌ఎస్‌ను జల సమాధి చేశారని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి (MP Chamala) ఎద్దేవా చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేటీఆర్ విమర్శలకు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన జీఆర్ఎంబీ సమావేశానికి హాజరై ఏపీ ప్రతిపాదనలను వ్యతిరేకించాలా వద్దా అని కేటీఆర్‌ను ఎంపీ ప్రశ్నించారు. గతంలో కేసీఆర్ రాయలసీమకు వెళ్లి వైఎస్సార్‌సీపీ నాయకురాలి ఇంట్లో చేపల పులుసు తిని.. ‘రాయలసీమను రతనాల సీమ చేస్తాం’ అని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తుచేశారు. అలాగే మాజీ సీఎం జగన్‌ను ప్రజా భవన్‌కు ఆహ్వానించి బిర్యానీ తినిపిస్తూ గోదావరిలో మిగులు జలాలు ఉన్నాయని చెప్పింది కేసీఆర్ కాదా అని నిలదీశారు.
కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చంద్రబాబుతో అవగాహన ఉందంటూ బీఆర్‌ఎస్ దుష్ప్రచారం చేస్తోందని చామల ఆరోపించారు. తెలంగాణ ప్రజలలో మళ్లీ సెంటిమెంట్‌ను రెచ్చగొట్టేందుకే బీఆర్‌ఎస్ ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. కృష్ణా జలాలు, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్‌కు లేదని స్పష్టం చేశారు. కృష్ణా నదీ జలాలలో తెలంగాణకు 299 టీఎంసీల వాటాకు అంగీకరించి సంతకం చేసింది బీఆర్‌ఎస్ కాదా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఉన్న ప్రేమ బీఆర్‌ఎస్ నేతలకు పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఎందుకు లేదని నిలదీశారు.
రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే ఉద్దేశంతోనే సీఎం రేవంత్ రెడ్డి ‘హిల్ట్’ పాలసీని తీసుకొచ్చారని ఎంపీ తెలిపారు. కేటీఆర్ తన వద్ద ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారులతో హైడ్రా వ్యవస్థకు వ్యతిరేకంగా కోర్టులలో కేసులు వేయిస్తున్నారని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఏ నిర్ణయం తీసుకున్నా కేటీఆర్ రాజకీయ కోణంలోనే చూస్తున్నారని విమర్శించారు. 140 ఏళ్ల ఘన చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ముందు బీఆర్‌ఎస్ ఒక ‘పిల్ల పార్టీ’ అని చామల వ్యాఖ్యానించారు. కేవలం ఎన్నికలు, కలెక్షన్ల కోసమే కేసీఆర్ పార్టీ పెట్టారని, ప్రజల కోసం కాదని విమర్శించారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించి సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తే.. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని పదేళ్ల పాలనలో కేసీఆర్ అప్పులపాలు చేశారని ఆరోపించారు. కేటీఆర్ ఇకనైనా పిచ్చి మాటలు మాట్లాడటం మానుకోవాలని.. కేటీఆర్, హరీశ్ రావుల మాటలను తెలంగాణ ప్రజలు ఇకపై నమ్మరని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

