Mobile Popup Ad
Mobile Popup Ad

నల్లగొండలో అకాల వర్షం బీభత్సం

కలం, నల్లగొండ : నల్లగొండ (Nalgonda) జిల్లా కేంద్రంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. గురువారం కురిసిన అకాల వర్షం తీవ్ర విషాదాన్ని, అపార నష్టాన్ని మిగిల్చింది. ఈ జడివానకు తోడు ఈదురు గాలులు, గాలి దుమారం రేగడంతో పాటు వడగండ్ల వాన కూడా కురవడంతో నగర ప్రజలు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం నుండి ఆర్టీఓ ఆఫీస్‌కు వెళ్లే ప్రధాన రహదారిలో ఈ గాలివాన బీభత్సం స్పష్టంగా కనిపిస్తోంది. అక్కడ ఉన్న ఆన్‌లైన్ సెంటర్లు, మీసేవ కేంద్రాల పైకప్పు రేకులు ఈదురుగాలుల ధాటికి కొట్టుకుపోయి రోడ్డుపై చల్లాచెదురుగా పడిపోయాయి. విద్యుత్ తీగలు ఎక్కడికక్కడ తెగిపడటంతో పాటు స్తంభాలు కూడా నేల కూలాయి.

దీంతో ఆ మార్గంలో ప్రయాణాలు పూర్తిగా స్తంభించిపోయాయి. ఈ అకాల విపత్తు వల్ల స్థానిక చిన్న తరహా వ్యాపారులకు, ఆన్‌లైన్ సెంటర్ల నిర్వాహకులకు పెద్ద ఎత్తున ఆస్తి నష్టం వాటిల్లింది. దుకాణాల్లోని కంప్యూటర్లు, ఇతర సామాగ్రి దెబ్బతినడంతో తాము రోడ్డున పడ్డామని, ప్రభుత్వం తక్షణమే స్పందించి నష్టపరిహారం అందించి ఆదుకోవాలని షాపుల యజమానులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఇంతటి భారీ విపత్తు సంభవించినా క్షేత్రస్థాయిలో సహాయక చర్యలు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి.

ప్రమాదం జరిగి గంటలు గడుస్తున్నా అటువైపు విపత్తు నిర్వహణ బృందాలు కంటికి కనిపించలేదు. ఆపదలో మేముంటాం అంటూ ప్రచారాలు చేసుకునే ఆపదమిత్ర బృందాలు కూడా ఇంతవరకు ఘటనా స్థలానికి చేరుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోడ్లపై పడి ఉన్న విద్యుత్ తీగలు, రేకులను తక్షణమే తొలగించి, యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని నల్లగొండ ప్రజలు జిల్లా యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>