రాజధాని కోసం అమరావతి రైతులు ఎంతో త్యాగం చేశారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. వారి త్యాగాలను తాను కలలో కూడా మర్చిపోనని అన్నారు. రైతుల అవస్థలను తాను చూశానని, రోడెక్కి ఉద్యమాలు చేసినా వారిని పట్టించుకున్న నాథుడు లేడని ఆయన గుర్తు చేశారు. అమరావతి రైతులు రోడ్డెక్కి నిరసన చేస్తుంటే కొందరు ప్యాలెస్‌లలో ఏమీ పట్టనున్నట్లు కూర్చున్నారని గత ప్రభుత్వంపై విమర్శలు చేశారు. అమరావతిలో నిర్మించిన సీఆర్డీఏ కార్యాలయాన్ని(CRDA Headquarters) సీఎం చంద్రబాబు సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగానే ఆయన రైతులకు గుడ్ న్యూస్ చెప్పారు. అమరావతిలో మొదటిగా సీఆర్డీఏ భవనం వచ్చిందని, రానున్న రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు కూడా వస్తాయని చెప్పారు. విభజన సమయంలో రాజధాని కూడా లేని పరిస్థితుల్లో ఏపీ ఏర్పాటయిందని, రాష్ట్ర భవిష్యత్తుకు ఉపయోగపడేలా.. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజధాని అమరావతిని నిర్మించాలని ఆరోజే నిశ్చయించుకున్నామని, ఆ విధంగా అమరావతిని సిద్ధం చేస్తున్నామని ఆయన చెప్పారు.
‘‘రాష్ట్రం ఏర్పడిన సమయంలోనే విజయవాడ-గుంటూరు మధ్యలో రాజధాని ఉంటే బాగుంటుందని నిర్ణయించాం. అప్పటికే ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ తయారు చేశాం. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు. ప్రపంచ చరిత్రలో ఇంత పెద్ద మొత్తంలో భూసమీకరణ జరిగింది ఎక్కడా లేదు. గతంలో హైటెక్ సిటీ నిర్మించినప్పుడు నా విజన్ చెబితే చాలా మంది నన్ను అవహేళన చేశారు. కానీ, ఇప్పుడు అంతా దాన్ని పొగుడుతున్నారు. హైదరాబాద్‌లో 5 వేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు నిర్మించాం. ఎయిర్‌పోర్టుకు భూమి ఇవ్వాలని ఆనాడు కోరితే రైతులు వెంటనే ఇచ్చారు. అక్కడ భూములు కొన్నవారు బ్రహ్మాండంగా బాగుపడ్డారు. ఇక్కడ అమరావతిని అంతకుమించి అభివృద్ధి చేస్తాం’’అని చంద్రబాబు చెప్పారు.
Read Also: నకిలీ మద్యానికి చెక్ పెట్టడానికి స్పెషల్ యాప్: చంద్రబాబు

