కలం, వెబ్ డెస్క్: కడప జిల్లా ప్రొద్దుటూరు వేదికగా కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జల్‌జీవన్ మిషన్ 2.0 – అమరజీవి జలధార’ (Amarajeevi Jaladhara) కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించిన ప్రత్యేక జల్‌జీవన్ పైలాన్‌ను వారు ఆవిష్కరించారు.
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడికి శాశ్వత పరిష్కారం చూపేందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు పేరిట తీసుకొచ్చిన ఈ భారీ ప్రాజెక్టును రూ. 30,156 కోట్ల అంచనా వ్యయంతో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయనున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ సురక్షితమైన తాగునీటిని అందించడమే లక్ష్యంగా ఈ పథకం ద్వారా కొత్తగా 27.36 లక్షల కుళాయి కనెక్షన్లను ఏర్పాటు చేయనున్నారు.
ఈ పథకంలో భాగంగా రిజర్వాయర్లు, ఉపరితల జల వనరుల ఆధారంగా పైప్లైన్ల ద్వారా ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీటిని సరఫరా చేసేలా మల్టీ విలేజ్, సింగిల్ విలేజ్ స్కీమ్‌లను ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలు తాగునీటి కోసం దూరప్రాంతాలకు వెళ్లే కష్టాలు తప్పనున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు, పంచాయతీరాజ్, గ్రామీణ నీటి సరఫరా శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

