కలం, వెబ్ డెస్క్ : కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి ప్రతిపాదించిన ప్రాజెక్టులో(KBR Park Flyover Project) కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. గతంలో ప్రతిపాదించిన 7 ఫ్లైఓవర్లు, 7 అండర్‌పాస్‌ల నిర్మాణాన్ని రద్దు చేసి, వాటి స్థానంలో ఒకే 6 లేన్ల ఫ్లైఓవర్, ఒక అండర్‌పాస్ నిర్మించాలని నిర్ణయించారు. GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ కొత్త ఫ్లైఓవర్ రూట్‌ను పరిశీలించారు. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ నుంచి నాగార్జున సర్కిల్ వరకు 4.4 కిలోమీటర్ల మేర 6 లేన్ల సింగిల్ ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. అలాగే బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10 నుంచి 12 మధ్య ఒక అండర్‌పాస్ ఏర్పాటు చేయనున్నారు.
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వేను శాశ్వతంగా అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న డివైడర్లను తగ్గించి రహదారిని ఆరు లేన్లుగా మార్చనున్నారు. కొత్త ప్రతిపాదనతో ప్రాజెక్టు వ్యయం కూడా భారీగా తగ్గనుంది. గత ప్రణాళికతో పోలిస్తే సుమారు రూ.400 కోట్ల మేర ఖర్చు తగ్గుతుందని GHMC కమిషనర్ ఆర్.వి. కర్ణన్ తెలిపారు.

