మూసీ డీపీఆర్‌పై వచ్చిన క్లారిటీ.. ఖర్చెంతో తేలింది..!

కలం, తెలంగాణ బ్యూరో: మూసీ (Musi River Front Project) పునరుజ్జీవం ప్రాజెక్టుపై అధికార, విపక్షాల మధ్య అసెంబ్లీ వేదికగానే మాటల యుద్ధం కొనసాగుతున్నది. మొత్తం ప్రాజెక్టుకు లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నట్లు బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ (KTR) వ్యాఖ్యానించారు. సమగ్ర ప్రాజెక్టు నివేదిక (DPR) లేకుండానే ఫస్ట్ ఫేజ్‌ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ (PPT) ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపైనా, రాష్ట్ర ప్రభుత్వంపైనా విమర్శలు చేస్తున్నారు. వీటన్నింటిపై బుధవారం జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్‌బాబు మధ్య డైలాగ్ వార్ జరిగింది. మంత్రుల వివరణతో సంతృప్తి చెందని బీఆర్ఎస్ సభ్యులు చివరకు వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్ళిపోయారు. డీపీఆర్ విషయంలో, ప్రభుత్వం చేయనున్న ఖర్చుపైనా స్పష్టత లేకపోవడంతో ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.

ఫస్ట్ ఫేజ్ ఖర్చు ఏడువేల కోట్లే :

మూసీ ఫస్ట్ ఫేజ్‌కు చేస్తున్న ఖర్చుపై ఆ వ్యవహారాలు చూస్తున్న ఓ అధికారి స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్షాలు చెప్తున్నట్లుగా అంచనా వ్యయం లక్ష కోట్లు లేదా లక్షన్నర కోట్లు కాదన్నారు. ఇప్పటివరకు లక్ష కోట్ల ప్రస్తావనే ప్రభుత్వం దగ్గర లేదని, డీపీఆర్ (Musi DPR) కూడా తయారైందని, అందులో అంచనా వ్యయాన్ని రూ. 7 వేల కోట్లు దాటకుండా ప్రస్తావించామని క్లారిటీ ఇచ్చారు. ప్రతిపాదనలు ఇంకా ఖరారు కాలేదని, అంచనాను మాత్రమే ప్రభుత్వానికి వివరించామని, స్పష్టమైన లెక్కలు తయారవుతున్నాయన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ ఫేజ్ ఖర్చు లక్ష కోట్లు ఉండే ప్రసక్తే లేదని, డీపీఆర్ తయారు కాలేదన్న ఆరోపణల్లో వాస్తవమే లేదన్నారు. ముఖ్యమంత్రి ప్రదర్శించిన పీపీటీ సమయానికే డీపీఆర్‌ను ప్రస్తావించినట్లు గుర్తుచేశారు. ఆరు నూరైనా మూసీ పునరుజ్జీవం ప్రాజెక్టు కార్యరూపం దాలుస్తుందని నొక్కిచెప్పారు.

అంతర్జాతీయ ద్రవ్య సంస్థల నిధులతో… :

అంతర్జాతీయ ద్రవ్య సంస్థల ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నట్లు ఆ అధికారి తెలిపారు. ప్రభుత్వ ప్రతిపాదనల్లో ఆసియా డెవలప్‌మెంట్ బ్యాంక్ (ADB) ఉన్నదని, అది సిద్ధం కాకపోతే మరో సంస్థ ఉంటుందన్నారు. నిధులు ఇవ్వడానికి అనేక అంతర్జాతీయ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నాయన్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కో ఆపరేషన్ ఏజెన్సీ (JAICA), ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్ మెంట్ బ్యాంక్ (AIIB) లాంటి పలు సంస్థలు మూసీ ప్రాజెక్టుకు నిధులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏఐఐబీ సంస్థ ప్రతినిధులు ఒక రోజు క్రితమే అసెంబ్లీకి వచ్చి ప్రభుత్వ పెద్దలను కలిసి వెళ్లారని గుర్తుచేశారు. మూసీ ప్రక్షాళన కోసం ఆర్థిక సాయాన్ని అందించడానికి సంసిద్ధతను వ్యక్తం చేశారన్నారు. మూసీ రివర్ బఫర్ జోన్ పరిధి 50 మీటర్లు మాత్రమేనని, ఏ నదికైనా బఫర్ జోన్ అర కిలోమీటరో లేక కిలోమీటర్ పరిధి వరకో ఉండదన్నారు. ఈ వాదనలు అవగాహనా రాహిత్యంతో కూడుకున్నవన్నారు. గాంధీ సరోవర్ ప్రాజెక్టులో భాగంగా రివర్ బెడ్, బఫర్ జోన్‌లోని నిర్మాణాలను, మధు రిడ్జ్ అపార్టుమెంట్ వ్యవహారాన్ని ప్రభుత్వం చూసుకుంటుందన్నారు.

Read Also: మొయినాబాద్ డ్రగ్స్ కేసు.. స్పందించిన సీఎం రేవంత్‌

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>