Mobile Popup Ad
Mobile Popup Ad

ప్రధాని మోదీకి సీజేపీ బహిరంగ లేఖ.. రేపటి నుంచి భారీ నిరసన!

కలం, వెబ్ డెస్క్ : దేశంలో పరీక్షల పేపర్ లీకేజీల వ్యవహారం, పునఃపరీక్షల ఒత్తిడి కారణంగా విద్యార్థులు ఎదుర్కొంటున్న తీవ్ర మానసిక ఆందోళనలపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) ప్రతినిధి అభిజీత్ దిప్కే (Abhijeet Dipke) ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఒక బహిరంగ లేఖ రాశారు. గత కొన్ని వారాలుగా దేశవ్యాప్తంగా 11 మంది యువ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం అత్యంత బాధాకరమని, అందులోనూ గత 48 గంటల్లోనే ఐదుగురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోవడం దేశ భవిష్యత్తును ప్రమాదంలో పడేసే తీవ్రమైన సంక్షోభానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

వరుసగా జరుగుతున్న విద్యా వ్యవస్థ వైఫల్యాల వల్ల ఎంతో మంది విద్యార్థుల కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టాన్ని మూటగట్టుకున్నాయని లేఖలో వివరించారు. తమ పిల్లల చదువుల కోసం సర్వస్వం ధారపోసి, విద్యా రుణాలు తీసుకున్న తల్లిదండ్రులు వ్యవస్థాగత లోపాల వల్ల పిల్లలను కోల్పోయి తీవ్ర నిరాశలో ఉన్నారని తెలిపారు. అందువల్ల, పేపర్ లీకేజీల సంక్షోభం కారణంగా ఆత్మహత్య చేసుకున్న ప్రతి విద్యార్థి కుటుంబానికి ప్రభుత్వం వెంటనే ఒక కోటి రూపాయల చొప్పున పరిహారం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

దేశ విద్యా వ్యవస్థను దెబ్బతీసినందుకు గాను కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి తొలగించాలని ప్రధానమంత్రిని కోరారు. ఈ వైఫల్యాలపై దేశవ్యాప్తంగా విద్యార్థులు నిరసనలు తెలుపుతున్నారని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం ద్వారానే విద్యా వ్యవస్థపై ప్రజల్లో మళ్లీ నమ్మకం ఏర్పడుతుందని స్పష్టం చేశారు. తమ డిమాండ్లను వినిపించడానికి జూన్ 20 నుండి దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన కార్యక్రమానికి సిద్ధమవుతున్నట్లు లేఖలో స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>