కలం, వెబ్ డెస్క్: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేయడంపై కాక్రోచ్ జనతా పార్టీ (CJP) స్పందించింది. తమ నిరసనతో ప్రజాస్వామ్యం గెలిచిందని.. కాక్రోచ్లు గెలిచారని ఆ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే వ్యాఖ్యానించారు. కేంద్రానికి తమ సత్తా చూపించమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. విద్యావవస్థను ప్రక్షాళన చేసేవరకు తమ ఉద్యమం ఆగదని చెప్పారు. ఈ సాయంత్రం 6 గంటలకు దేశవ్యాప్తంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. తమకు రాజకీయాలు అవసరం లేదని.. విద్యార్థులకు దక్కిన గొప్ప విజయం ఇది అని అభివర్ణించారు. పేపర్ లీక్ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి కుటుంబాలకు రూ. 1 కోటి చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
కాసేపటి క్రితమే ధర్మేంద్ర ప్రధాన్ తన పదవికి రాజీనామా చేశారు. గత 10 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు తనను బాధించాయని చెప్పారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ సహా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల్లో దేశ వ్యతిరేక శక్తులు చొరబడకుండా చూడటమే తమ లక్ష్యమని చెప్పుకొచ్చారు.

