కలం, నకిరేకల్: వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో నకిరేకల్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ ఓటరు నమోదు ప్రక్రియను(MLC Voter Registration) వేగవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) పిలుపునిచ్చారు. బుధవారం నకిరేకల్ నియోజకవర్గంలోని చిట్యాల పట్టణ కేంద్రంలో ఉన్న బి.ఎన్. రెడ్డి గార్డెన్స్‌లో ఎమ్మెల్సీ ఓటరు నమోదు పురోగతిపై నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని మండలాలు, గ్రామాలు, మున్సిపాలిటీలకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పూర్తి సమన్వయంతో పనిచేసి అర్హులైన పట్టభద్రులందరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని సూచించారు. ఎమ్మెల్సీ ఓటరు నమోదు దరఖాస్తుల స్వీకరణకు నవంబర్ 6వ తేదీ చివరి తేదీ అని గుర్తుచేశారు. గడువు సమీపిస్తున్నందున పార్టీ శ్రేణులు ప్రత్యేక శ్రద్ధ వహించి, ప్రతి అర్హుడికి ఓటు హక్కు కల్పించేలా కృషి చేయాలని కోరారు.
డిగ్రీ పూర్తి చేసుకుని మూడేళ్లు పూర్తయిన అర్హులైన ప్రతి పట్టభద్రుడికి ఓటరు నమోదు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. ఇందుకోసం డివిజన్, మండల, గ్రామాల వారీగా ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. పట్టభద్రులకు సులభంగా అందుబాటులో ఉండేలా కాలనీలు, గ్రంథాలయాలు, సచివాలయాల వద్ద ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేసి, నమోదు ప్రక్రియలో అవసరమైన సాంకేతిక, పరిపాలనాపరమైన సహకారం అందించాలని సూచించారు.
ఆన్లైన్ ద్వారా ఫారం-18లో దరఖాస్తు (MLC Voter Registration) చేసుకునే విధానంపై పట్టభద్రులకు సమగ్ర అవగాహన కల్పించాలన్నారు. ఆఫ్‌లైన్ దరఖాస్తులను సకాలంలో సేకరించి, సంబంధిత ఎన్నికల అధికారుల కార్యాలయాలకు అందజేయాలని సూచించారు. దరఖాస్తుల పరిశీలన, ఆమోద ప్రక్రియ వేగంగా జరిగేలా అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా ఇంటింటికీ వెళ్లి అర్హులైన పట్టభద్రులను గుర్తించాలని, దరఖాస్తుకు అవసరమైన సర్టిఫికెట్లు, ధ్రువపత్రాలపై అవగాహన కల్పిస్తూ ఓటరు నమోదు ప్రక్రియను విజయవంతం చేయాలని చిరుమర్తి లింగయ్య పిలుపునిచ్చారు.
Also Read : స్మిత్ మచ్చర్‌కు యూఏఈ పురస్కారం!
Follow Us On : WhatsApp

