కలం, కరీంనగర్: కరీంనగర్ (Karimnagar) జిల్లా వ్యాప్తంగా రైతాంగం కరువు కోరల్లో చిక్కుకుని అల్లాడుతోందని, ప్రభుత్వం తక్షణమే జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఆ పార్టీ జిల్లా కార్యదర్శి పంజాల శ్రీనివాస్ (Panjala Srinivas) ఒక ప్రకటన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కరువు మండలాల జాబితా హాస్యాస్పదంగా, అశాస్త్రీయంగా ఉందని శ్రీనివాస్ విమర్శించారు. జిల్లాలో కేవలం కరీంనగర్ రూరల్, కరీంనగర్ అర్బన్, హుజూరాబాద్ మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమన్నారు. ఏ ప్రాతిపదికన ఆయా మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారో అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ సాగు భూములే లేని, పూర్తిగా కాంక్రీట్ జంగిల్‌గా మారిన కరీంనగర్ అర్బన్ పరిధిని కరువు ప్రాంతంగా చూపిస్తూ, ఎకరాకు వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి వర్షాలు లేక పంటలు ఎండిపోతున్న గ్రామీణ మండలాలను పక్కన పెట్టడం రైతాంగాన్ని వంచించడమేనని అన్నారు. ఆయా మండలాల్లో ఎండిపోతున్న పంటలు అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
జిల్లాలోని మానకొండూరు, తిమ్మాపూర్, గంగాధర, రామడుగు, చొప్పదండి, చిగురుమామిడి, సైదాపూర్, శంకరపట్నం, ఇల్లందకుంట వంటి మండలాల్లో వరి, పత్తి పంటలకు సాగునీరు అందక, ప్రభుత్వం సకాలంలో విద్యుత్ సరఫరా చేయక చేతికొచ్చే దశలో పంటలు ఎండిపోతున్నాయని తెలిపారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారని పేర్కొన్నారు. అధికారుల తప్పుడు నివేదికల కారణంగా జిల్లాలోని మెజారిటీ రైతులు ప్రభుత్వ పెట్టుబడి రాయితీ (ఇన్పుట్ సబ్సిడీ), పంట రుణాల మాఫీ లేదా రీషెడ్యూల్, పంటల బీమా వంటి ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
కేవలం మూడు మండలాలకే పరిమితం చేసిన అశాస్త్రీయ జీవోను, కరువు జాబితాను సవరించాలని డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నప్పటికీ, అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలనకు వెళ్లకుండా ఏసీ గదుల్లో కూర్చుని ఉపగ్రహ చిత్రాలు, తప్పుడు తేమ లెక్కల ఆధారంగా నివేదికలు తయారు చేశారని విమర్శించారు. ఈ పరిస్థితి అధికారుల పనితీరును స్పష్టం చేస్తోందన్నారు.
జిల్లా వ్యాప్తంగా రీ-సర్వే నిర్వహించి, ప్రత్యేక అధికారుల బృందాలతో క్షేత్రస్థాయిలో పంట నష్టంపై పారదర్శకంగా నివేదికలు తయారు చేయాలని శ్రీనివాస్ డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోయిన ప్రతి మండలాన్ని కరువు జాబితాలో చేర్చుతూ సప్లిమెంటరీ నోటిఫికేషన్ విడుదల చేయాలని కోరారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం కారణంగా దెబ్బతిన్న ప్రతి ఎకరాకు రూ.25 వేల చొప్పున తక్షణ పెట్టుబడి రాయితీ అందించి రైతులను ఆదుకోవాలని అన్నారు. కరువు పీడిత రైతులందరి పంట రుణాలను రీషెడ్యూల్ చేయాలని, బ్యాంకులు, ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు రైతుల నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లాలోని అన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించాలని, లేనిపక్షంలో సిపిఐ ఆధ్వర్యంలో రైతులతో కలిసి ఆందోళనలు చేపడతామని పంజాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

