కలం, వెబ్‌డెస్క్: దుబాయ్ నుంచి టెల్ అవీవ్ వెళ్తున్న ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన వైమానిక దాడి సమయంలో అప్రమత్తంగా వ్యవహరించి ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన భారతీయ కెప్టెన్ స్మిత్ మచ్చర్ (Smit Machchhar)కు యూఏఈ పురస్కారం లభించింది. ఆయనతో పాటు తోటి సిబ్బందిని యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ‘ఆర్డర్ ఆఫ్ జాయెద్ II’ పురస్కారంతో సత్కరించారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్, యూఏఈ ఉప ప్రధాని షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తూమ్ స్వయంగా ఈ పతకాలను అందజేసి వారి ధైర్యసాహసాలను ప్రశంసించారు.
సెప్టెంబర్ 30న దుబాయ్ నుంచి టెల్ అవీవ్‌కు బయలుదేరిన విమానంలో ఈ ఊహించని పరిణామం చోటు చేసుకుంది. 170 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఈ విమానంలో, ఓమాన్ జాతీయుడైన కో-పైలట్ ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌పై గొడ్డలితో విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ హఠాత్పరిణామంతో విమానం క్షణాల వ్యవధిలోనే ఒక్కసారిగా కిందకు పడిపోయింది. తీవ్రగాయాలపాలై రక్తపుమడుగులో ఉన్నప్పటికీ, కెప్టెన్ మచ్ఛర్ తన చివరి ప్రయత్నంగా కాక్‌పిట్ తలుపు తెరిచారు. దీంతో వెంటనే అప్రమత్తమైన ప్రయాణికులు, ఇతర సిబ్బంది ఆ కో-పైలట్‌ను అదుపులోకి తీసుకున్నారు. విమానంలో ప్రయాణిస్తున్న మరో ఇద్దరు ఫ్లై దుబాయ్ పైలట్లు విమానాన్ని సౌదీ అరేబియాలోని తబూక్ నగరంలో సురక్షితంగా ల్యాండ్ చేశారు. ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చూపిన ఈ అసాధారణ ధైర్యసాహసాలకు గుర్తింపుగా యూఏఈ ప్రభుత్వం ఈ గౌరవాన్ని అందించింది. ఈ ఘటన అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నప్పుడు మచ్చర్‌కు ప్రధాని మోదీ సైతం ఫోన్ చేసి పరామర్శించారు. ఆయన ధైర్య సాహసాలను అభినందించారు.

