Mobile Popup Ad
Mobile Popup Ad

కాంగ్రెస్ హయాంలో అంధకారంలో రైతన్నల జీవితాలు: చిరుమర్తి లింగయ్య

కలం, నల్గొండ బ్యూరో: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రైతన్నల జీవితాలు అంధకారంలోకి వెళ్లాయని నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) తెలిపారు. నకిరేకల్ మండల కేంద్రం మూసీరోడ్డులోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా చిరుమర్తి లింగయ్య మాట్లాడుతూ.. పంట వేసిన నాటి నుంచి మొదలు పండించిన పంటను అమ్ముకునే వరకు రైతులు అష్టకష్టాలు పడుతున్నారన్నారు. రాష్ట్రం అంతా పరిస్థితులు ఒకలా ఉంటే నకిరేకల్ నియోజకవర్గంలో మాత్రం మరీ దారుణంగా ఉన్నాయని తెలిపారు. ఎమ్మెల్యే ఒక నియంతలాగా ప్రతీ విషయంలో వారి జోక్యంతో గ్రామాల్లో ఎక్కడ చూసినా ఘర్షణ వాతావరణమే నెలకొన్నదని ఆరోపించారు. ఎమ్మెల్యే హుకుంతో కాంగ్రెస్ పార్టీ చోటా మోటా నాయకుల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, భార్య భర్తల పంచాయతీల నుంచి భూమి గెట్టు పంచాయతీల వరకు షాడో పోలీసుల్లా కాంగ్రెస్ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారని ఫైర్ అయ్యారు.

తప్పును వేలెత్తి చూపిన అమాయక జనాలపై స్వయంగా ఎమ్మెల్యే దాడి చేస్తున్నారంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో స్థానిక ఎమ్మెల్యే ప్రైవేటు వ్యక్తులతో ధాన్యం కొనుగోళ్లలో దోపిడి చేస్తున్నారని, స్థానిక ఎమ్మెల్యే ఫొటోలకు ఫోజులు ఇవ్వడం, రీల్స్ కోసం హడావుడి చేయడం తప్ప రైతులకు మేలు మాత్రం జరగడం లేదని ఆరోపించారు. లారీలు సక్రమంగా రావడం లేదని, కాంటాలు సకాలంలో జరగడం లేదని ప్రశ్నించిన రైతులను తన్నిన సంఘటనలు మొన్న నార్కట్ పల్లి మండలంలో నిన్న నకిరేకల్ మండలంలో నెలకొన్నాయని తెలిపారు. దేశానికీ అన్నం పెట్టే రైతన్న గుండెలపై తన్నిన సంఘటనను తీవ్రంగా ఖండిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రైతుల గౌరవం, భద్రత, సమస్యలను పరిష్కరించాల్సిన ప్రభుత్వాలు, అధికారులు వారిపై దౌర్జన్యానికి దిగడం వారిని కాలితో తన్నడం అత్యంత దురదృష్టకరమని చిరుమర్తి లింగయ్య (Chirumarthi Lingaiah) పేర్కొన్నారు. రైతులపై దాడి చేసిన స్థానిక ఎమ్మెల్యే తక్షణమే యావత్ తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేశారు.

Read Also: తల్లి ఆశీర్వాదం తీసుకున్న డీజీపీ సీవీ.ఆనంద్

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>