కలం, వెబ్ డెస్క్ : సీఎం రేవంత్ రెడ్డికి టాలీవుడ్ మద్దతు ఎప్పటికీ ఉంటుందని మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) అన్నారు. గద్దర్ సినీ అవార్డుల వేడుక-2025లో భాగంగా చిరంజీవి ఎన్టీఆర్ నేషనల్ అవార్డును సీఎం రేవంత్ చేతుల మీదుగా అందుకున్నారు. ఈ సందర్భంగా చిరంజీవి (Chiranjeevi) మాట్లాడుతూ.. అవార్డులు వచ్చిన అందరికీ అభినందనలు తెలియజేశారు. ‘సినీ కళాకారులకు అవార్డు అనేది ఒక ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఒకప్పుడు మరుగున పడిపోయిన ఈ అవార్డుల ప్రాముఖ్యతను సీఎం రేవంత్ రెడ్డి గుర్తించి ఇలా అందజేస్తున్నందుకు చాలా థాంక్స్. ఆయనకు సినిమా వల్ల కలిగే ప్రభావం, అది సృష్టించే ఉపాధి గురించి బాగా తెలుసు’ అని చిరంజీవి అన్నారు.
ప్రస్తుతం తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరుకుందని.. ప్రస్తుతం టాలీవుడ్ సినిమా అంటే ఇండియన్ అనే స్థాయికి చేరుకోవడం సంతోషంగా ఉందన్నారు చిరంజీవి. ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమా అని గుర్తించే విధంగా ఈ అవార్డుల వేడుకలను నిర్వహిస్తున్నందుకు తెలంగాణ ప్రభుత్వానికి ఇండస్ట్రీ తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు చిరంజీవి. సీఎం రేవంత్ ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా వాటిని శిరసావహిస్తామని చిరంజీవి వెల్లడించారు. అలాగే ఏపీ ప్రభుత్వం కూడా అవార్డులను అందజేయాలని సీఎం చంద్రబాబు నాయుడిని చిరంజీవి కోరారు.

