కలం, పెద్దపల్లి: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న ప్రజా ప్రభుత్వానికి ప్రజా సంక్షేమం, అభివృద్ధి సామాజిక న్యాయమే ప్రధాన లక్ష్యమని ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణారావు (Chinthakunta Vijaya Ramana Rao) స్పష్టం చేశారు. గురువారం పెద్దపల్లి ఐడీఓసీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన జిల్లా స్థాయి ‘ప్రజాపాలన దినోత్సవ’ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకు శుభాకాంక్షలు తెలిపారు.
రూ.135 కోట్ల ఆర్థిక సాయం జమ..
ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ… ప్రజా ప్రభుత్వం వెయ్యి రోజుల పాలన పూర్తి చేసుకుందని, ఇచ్చిన హామీల అమలుతో పాటు పారదర్శక పాలనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. జిల్లాలో అమలవుతున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల వివరాలను ఆయన వెల్లడించారు. ఇందిరమ్మ ఇళ్లు మొదటి విడతలో జిల్లాకు మంజూరైన 7,199 ఇళ్లలో, నిర్మాణ పురోగతిని బట్టి ఇప్పటివరకు 5,982 మంది లబ్ధిదారుల ఖాతాల్లో రూ.135 కోట్ల ఆర్థిక సాయం జమ చేశామన్నారు.
40 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం..
ఉచిత అల్పాహారంలో మంథనిలో రూ.7.50 కోట్లతో కేంద్రీకృత వంటశాలను ఏర్పాటు చేసి, హరే రామ ట్రస్ట్ సహకారంతో 694 పాఠశాలలు, 17 జూనియర్ కళాశాలల్లోని 40 వేల మంది విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు రూ.82 కోట్లతో నాలుగు వరుసల సెంట్రల్ లైటింగ్ బైపాస్ రోడ్డు నిర్మాణానికి చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. ప్రజల దశాబ్దాల కల అయిన ఆర్టీసీ బస్ డిపో నిర్మాణానికి రూ.8.40 కోట్లు మంజూరయ్యాయని, పనులు శరవేగంగా సాగుతున్నాయని చెప్పారు.
రూ.700 కోట్లతో కోకాకోలా పరిశ్రమ..
రామగిరి మండలం రత్నాపూర్ గ్రామంలో రూ.700 కోట్లకు పైగా పెట్టుబడితో కోకాకోలా పరిశ్రమ ఏర్పాటు కానుందని, దీనిద్వారా స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి లభిస్తుందన్నారు. ఆరోగ్యశ్రీ ద్వారా 48,188 మందికి శస్త్రచికిత్సలు నిర్వహించి రూ.120.56 కోట్ల లబ్ధి చేకూర్చామని, వ్యాధి నిరోధక టీకాల్లో 100 శాతం లక్ష్యాన్ని సాధించామని తెలిపారు. టీజీఐపాస్ ద్వారా 31 యూనిట్లకు అనుమతులిచ్చి రూ.17.75 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని, మంథనిలో మహిళా పారిశ్రామికవేత్తల కోసం 2 ఎకరాల్లో ప్లగ్ అండ్ ప్లే గార్మెంటింగ్ యూనిట్లు కేటాయించామని చెప్పారు.నంది మేడారంలో రూ.51.28 కోట్లతో 7,682 కిలోవాట్ల సోలార్ మోడల్ ప్రాజెక్టును చేపడుతున్నామని వివరించారు.
ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష, అదనపు కలెక్టర్ బి.శ్రీరాములు, డీసీపీ రాంరెడ్డి, పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ నూగిళ్ల మల్లయ్య, ఆర్డీఓ బి. గంగయ్య, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

